టీఢీపీ

ABN , First Publish Date - 2021-02-25T06:33:08+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

టీఢీపీ

గ్రేటర్‌ పోరుకు దేశం సన్నద్ధం

టీడీపీ గ్రేటర్‌ వ్యూహం

జీవీఎంసీ ఎన్నికల ఇన్‌చార్జిగా నిమ్మల రామానాయుడు

కింజరాపు రామ్మోహననాయుడు నేతృత్వంలో ప్రచారం

నగరంలో ప్రచారానికి చంద్రబాబునాయుడు?

నగర నేతలతో పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం

వైసీపీ బెదిరింపులను తిప్పికొట్టాలని నిర్ణయం

కార్పొరేట్‌ అభ్యర్థులకు పూర్తి భరోసా 

కోర్టు తీర్పు తరువాత అభ్యర్థుల జాబితా విడుదల

మేయర్‌ అభ్యర్థిత్వంపై కసరత్తు

గండి బాబ్జీ, పీలా శ్రీనివాసరావు, కాకి గోవిందరెడ్డి, నజీర్‌లతో ముఖాముఖి


విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):


గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం నగర నేతలతో సమావేశమై కార్పొరేటర్‌ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలపై చర్చించారు. మేయర్‌ పదవి ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, పీలా శ్రీనివాసరావు, కాకి గోవిందరెడ్డి, మహ్మద్‌ నజీర్‌లతో అచ్చెన్నాయుడు, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంవీ భరత్‌ తదితరులు ముఖాముఖి సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల బలాబలాలు, ప్రత్యర్థి పార్టీ వ్యూహాలు తదితర అంశాలపై నలుగురి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ చర్చలలో ఆర్థికపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. నలుగురి అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళతామని అచ్చెన్నాయుడు వారికి వివరించారు. మేయర్‌ అభ్యర్థిపై తుది నిర్ణయం చంద్రబాబుదేనని చెప్పారు.


నియోజకవర్గాల వారీగా సమీక్ష


అనంతరం ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు బుద్దా నాగజగదీశ్వరరావు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, ఉత్తరం నియోజకవర్గ ఇన్‌చార్జి చిక్కాల విజయ్‌బాబుతో అచ్చెన్న వేర్వేరుగా సమావేశమై ఆయా సెగ్మెంట్‌లలో అభ్యర్థుల పరిస్థితి, ప్రచారంపై చర్చించారు. అలాగే ఎంవీ శ్రీభరత్‌తో ప్రత్యేకంగా సమావేశమై దక్షిణ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఆ తరువాత నగర నేతలతో అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. మేయర్‌ అభ్యర్థిత్వంపై బహుశా రెండు రోజుల్లో అధినేత నిర్ణయాన్ని ప్రకటించనున్నారని అచ్చెన్నాయుడు వివరించారు. జీవీఎంసీ పరిధిలో 90 శాతం కార్పొరేటర్‌ అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకున్నందున....అక్కడ ప్రచారం చేసుకోవచ్చునన్నారు. ఇబ్బందులు వున్నచోట రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.


కోర్టు తీర్పు తరువాతే అభ్యర్థుల ప్రకటన


విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ 98 మంది కార్పొరేటర్‌ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించడంతోపాటు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని కోరారు. దీనికి అచ్చెన్నాయుడు బదులిస్తూ మునిసిపల్‌ ఎన్నికలపై కోర్టులో దాఖలైన కేసులపై వాదనలు ముగిశాయని, త్వరలో తీర్పు వెలువడే అవకాశం ఉందన్నారు. ఆ తరువాతే 98 మంది వార్డులకు అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటిద్దామన్నారు. 


బెదిరింపులపై చర్చ


కాగా పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులకు అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న బెదిరింపులపై సమావేశంలో చర్చ జరిగింది. ఇటువంటి బెదిరింపులపై ఎదురుదాడికి దిగాలని సమావేశం నిర్ణయించింది. ఎవరెవరికి బెదిరింపులు వస్తున్నాయి? అన్నది తెలుసుకుని వారికి అండగా వుండాలని అచ్చెన్నాయుడు సూచించారు. ఒకటి, రెండుచోట్ల అభ్యర్థులు పార్టీని వీడినా ప్రత్యామ్నాయ అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు.


కాగా జీవీఎంసీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. జిల్లా ఇన్‌చార్జి నిమ్మకాయల చినరాజప్పకు సొంత జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలు వున్నందున రామానాయుడుకు జీవీఎంసీ బాధ్యతలు అప్పగించినట్టు అచ్చెన్నాయుడు వివరించారు. ఇంకా జీవీఎంసీలో ఎన్నికల ప్రచారం కోసం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో యువ నేతల బృందం వస్తుందన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జీవీఎంసీ ఎన్నికలలో ప్రచారం చేయనున్నట్టు చెప్పారు. కాగా సమావేశంలో పార్టీ నేతలు చోడే పట్టాభి, పాశర్ల ప్రసాద్‌, ఆళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 



పన్నులు పెంచం


నగరంలో అన్న కేంటీన్లు పునరుద్ధరణ

విశాఖ ఉక్కు పరిరక్షణ

మౌలిక వసతులు పెంపు

టీడీపీ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)



గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపొందిస్తోంది.  మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేయకపోయినా అందులోని నాలుగైదు అంశాలను విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ అధ్యక్షడు పల్లా శ్రీనివాసరావు సూచనప్రాయంగా వెల్లడించారు. నగరంలో పన్నులు పెంచబోమని మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నామన్నారు. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో భూమి విలువ ఆధారంగా పన్నులు వసూలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో పేద వర్గాల కోసం ఏర్పాటుచేసిన అన్న కేంటీన్లను నగరంలో పునరుద్ధరిస్తామన్నారు. అలాగే ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఏర్పడిన ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగేలా చూస్తామని నగర ప్రజలకు భరోసా ఇవ్వనున్నామన్నారు. ఇంకా నగరంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తామని, స్వచ్ఛమైన పాలన సాగిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు తెలిసింది. మేనిఫెస్టోను రెండు, మూడు రోజుల్లో అధికారికంగా విడుదల చేయనున్నారు. 


Updated Date - 2021-02-25T06:33:08+05:30 IST