ఇతర రాష్ట్రాల పోలీసులకూ.. నోటీసులిచ్చే దమ్ముందా?

ABN , First Publish Date - 2021-10-20T08:44:58+05:30 IST

‘రాష్ట్రంలో గంజాయి సాగుపై ప్రశ్నిస్తే ఎక్కడో విశాఖ జిల్లాలో ఉన్న నర్సీపట్నం పోలీసులు వాయువేగంతో పరిగెత్తుకొని గుంటూరు వచ్చి టీడీపీ సీనియర్‌ నేత

ఇతర రాష్ట్రాల పోలీసులకూ.. నోటీసులిచ్చే దమ్ముందా?

  • తాడేపల్లి పెదపాలేరు, పబ్జీ దొరలకు వెరవం
  • గంజాయిపై ప్రశ్నిస్తే మా ఇళ్లపైకి వస్తారా?
  • ఏం తప్పన్నారని ఆనందబాబుకు నోటీస్‌
  • తాడేపల్లి బోష్‌డీకేవన్నీ లత్కోరు వ్యవహారాలు
  • ఉద్యోగాలివ్వలేక యువతకు గంజాయి, డ్రగ్స్‌ పని
  • పట్టుకోవడానికి ఎవరోరావడం సిగ్గేయడం లేదా?: పట్టాభి ఫైర్‌


అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో గంజాయి సాగుపై ప్రశ్నిస్తే ఎక్కడో విశాఖ జిల్లాలో ఉన్న నర్సీపట్నం పోలీసులు వాయువేగంతో పరిగెత్తుకొని గుంటూరు వచ్చి టీడీపీ సీనియర్‌ నేత ఆనందబాబుకు నోటీసులు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల పోలీసులు ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ గంజాయి సాగు చేస్తున్న వారిని, రవాణా చేస్తున్న వారిని పట్టుకొంటున్నారు. తాడేపల్లి పెద పాలేరుకు వారికి కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించే దమ్ముందా? రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాక గంజాయి, డ్రగ్స్‌ ఇచ్చి వారిని నాశనం చేస్తున్నారు’’ అని తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. తాడేపల్లి బోష్‌డీకే లత్కోరు వ్యవహారాలను రాష్ట్ర ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసులు వచ్చి నోటీసు ఇవ్వడంపై మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.


‘‘తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సాగు గురించి మాట్లాడారు. గంజాయి సాగుకు రాష్ట్రం అడ్డాగా మారిందని బహిరంగంగా చెప్పారు. అదే విషయం ఆనందబాబు కూడా మాట్లాడారు’’ అని వివరించారు. తాడేపల్లి దద్దమ్మకు నిజంగా దమ్ముధైర్యం ఉంటే ఏపీలో సాగుతున్న మాదక ద్రవ్యాలు, గంజాయి మాఫియాపై దాడి చేసిన ఇతర రాష్ట్రాల పోలీసులకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘తాడేపల్లి పెద పాలేరు, పబ్జీ ఆడుకొనే దొర కలిసి వారి పోలీసులతో ఇప్పించే నోటీసులు మాకు చిత్తు కాగితంతో సమానం. నిజంగా ఈ చేతగాని దద్దమ్మలకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో గంజాయి సాగు, మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలి. నర్సీపట్నం పోలీసులు వారి ప్రాంతంలో సాగవుతున్న గంజాయిని పట్టించుకోకుండా ఎగేసుకొని గుంటూరుకు వచ్చి అర్ధరాత్రి మాజీ మంత్రికి నోటీసులు ఇచ్చారు. ఖాకీ డ్రస్‌ వేసుకున్న దొంగల మాదిరిగా అర్ధరాత్రి టీడీపీ నేతల ఇళ్లకు రావడం కాదు.. ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడారనేది ఆలోచించుకొంటే మంచిది. ఆనందబాబు మా ట్లాడిన దానిలో తప్పేముంది? ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు విలేకరుల సమావేశంలో మాట్లాడితే రాత్రి 11గంటలకు నర్సీపట్నం పోలీసులు ఆయన ఇంటి ముందు వాలారు.


7గంటలపాటు ప్రయాణం చేస్తే తప్ప వారు గుంటూరు రాలేరు. ఇంత మెరుపు వేగం గంజాయి సాగుచేసే వారిపై ఏనాడైనా చూపించారా? రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు పట్టుకోవడానికి వచ్చిన నల్లగొండ పోలీసులపైనా... తమిళనాడు పోలీసులపైనా దాడికి తెగబడ్డారు. తమిళనాడు పోలీసులపై ఏకంగా బాంబులతో దాడి జరిగింది. గంజాయి సాగు గురించి మాట్లాడటం దేశద్రోహమా? దానికి నోటీసులు ఇస్తారా? దళితులు, మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు ఏనాడైనా పోలీసులు ఇంతవేగంగా స్పందించారా? గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు వస్తుంటే ఇక్కడి పోలీసులకు సిగ్గేయడం లేదా?’’ అని ప్రశ్నించారు.


ఆ రాష్ట్రాలకు ఏం సమాధానమిస్తారు?

ఏపీ నుంచి గుజరాత్‌కు లిక్విడ్‌ గంజాయి వెళ్తోందని గుంటూరు ఎస్పీ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆయనకు కూడా నోటీసు ఇవ్వండి. ఏపీ నుంచి వస్తున్న గంజాయిని పట్టుకొన్నామని ఉత్తర  ప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల పోలీసులు చెప్పారు. దద్దమ్మల్లాగా... చవటల్లాగా తాడేపల్లి ప్యాలె స్‌లో కూర్చున్న మీకు.. దమ్ముంటే ఇతర రాష్ట్రాల పోలీసులకూ నోటీసులు ఇవ్వండి’’ అని సవాలు విసిరారు. వైసీపీ నేతలే స్మగ్లర్లతో చేతులుకలిపి గంజాయి సాగు, రవాణా చేస్తున్నారని వార్తలు వచ్చాయని, దానికి తాడేపల్లి పాలేరు ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Updated Date - 2021-10-20T08:44:58+05:30 IST