Abn logo
Sep 17 2021 @ 23:19PM

మనం ఎక్కడున్నాం.. ఆంధ్రాలోనా.. ఆఫ్ఘానలోనా!?

విలేకరులతో మాట్లాడుతున్న అజీజ్‌, పక్కన కోటంరెడ్డి

చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండించిన నేతలు

శాంతిభద్రతలు లేవనేందుకు ఈ ఘటనే నిదర్శనం : సోమిరెడ్డి

సీఎం పరోక్ష ఆదేశాలతోనే.. : బీద 

ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బీద, అజీజ్‌, కోటంరెడ్డి

వళ్లు దగ్గరపెట్టుకోండి : తెలుగు యువత ఆగ్రహం


నెల్లూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి వైసీపీ బరితెగింపునకు పరాకాష్టగా తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు.  ఆంధ్రాలో ఉన్నామా.. ఆఫ్ఘనిస్తానలో ఉన్నామా అని దుయ్యబట్టారు. జగన్మోహనరెడ్డి పాలనలో శాంతిభద్రతలు లేవనేందుకు తాజా ఘటనే నిదర్శనమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల దూషణలు, బూతులతో పోలిస్తే అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చాలా చిన్నవన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాకే అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. హెచ్చరించి మరీ కర్రలు, కత్తులతో వచ్చే వారికి పోలీసులు స్వాగతం పలకడం దురదృష్టకరమన్నారు. కాగా తాలిబన్లు సైతం అసూయ చెందేలా రాష్ట్రంలో వైసీపీ నేతల వ్యవహార శైలి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మరో ప్రకటనలో విమర్శించారు. సీఎం పరోక్ష ఆదేశాలతో, పోలీసుల అండదండలతో ప్రతిపక్ష నేత ఇంటిపైకి రాళ్లదాడి జరిపించిన ఘటనను చూసి పక్క రాషా్ట్రలు నివ్వెరపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే చంపేస్తాం.. సంక్షేమ పథకాల డొల్లతనాన్ని విమర్శిస్తే రాళ్లతో దాడి చేస్తాం అన్నట్లు వైసీపీ నేతల తీరు ఉందని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని, జోగి రమేష్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


ప్రజల దృష్టి మరల్చేందుకే..


నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి హేయమైన చర్య అని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ ఖండించారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నగర ఇనచార్జ్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలిసి ఆయన విలేకరుతో మాట్లాడారు. కరోనా దెబ్బకు ప్రజలు ఆర్థికంగా చితికిపోతుంటే ప్రభుత్వం మాత్రం ప్రజలపై ధరల భారం వేస్తోందని, ఆఖరుకు చెత్తపై కూడా పన్ను విధించిందన్నారు. దీని గురించే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడారని, దానిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించడం సిగ్గు చేటన్నారు.  రాష్ట్రంలో అసమర్థ డీజీపీ ఉన్నారని మండిపడ్డారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో ఏదైనా పెద్ద సమస్య ఏర్పడినప్పుడు దానిని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి సీఎం జగన్మోహనరెడ్డి ఏదో ఒక డ్రామాను తెరపైకి తీసుకొస్తారని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే జరుగుతోందని చెప్పారు.  రాష్ట్రంలో దయనీయ స్థితిలో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు టీడీపీ చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన బాగుండడంతో ఎలాగైనా ప్రజల దృష్టిని మరల్చాలని తన ఎమ్మెల్యే జోగి రమేష్‌ను సీఎం జగన్మోహనరెడ్డి.. చంద్రబాబు ఇంటిపైకి ఉసిగొల్పారని ఆరోపించారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కాదని, అది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. పద్నాలుగేళ్లు రాషా్ట్రన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు నివాసం వైపు వైసీపీ నేతలు వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జోగి రమేష్‌ చేసిన పని తమకూ చేయడం వచ్చునని, కానీ తమకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు. జోగి రమేష్‌ వెంటనే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతమైతే వైసీపీ నేతలు తిరగలేరని హెచ్చరించారు. 


ఎమ్మెల్యే జోగి రమేష్‌ దిష్టిబొమ్మ దహనం


నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా నెల్లూరులో తెలుగు యువత నేతలు ఆందోళన చేపట్టారు. టీడీపీ జిల్లా కార్యాలయం ముందు రోడ్డుపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడు మాట్లాడుతూ జోగి రమేష్‌ ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని, చంద్రబాబు జోలికొస్తే ఉరికించి కొడతామని హెచ్చరించారు. దేశమంతా అంబేద్కర్‌ రాజ్యాంగం అమల్లో ఉంటే రాష్ట్రంలో రాజారెడ్డి  రాజ్యాంగం అమల్లో ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రసూల్‌, అమృల్లా, హజరతశెట్టి, సాయికిరణ్‌, రాజేష్‌, అస్లాం తదితరులు పాల్గొన్నారు. కాగా చంద్రబాబు నివాసంపై దాడి పిరికిపంద చర్య అని టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రజాస్వామ్య వాది అయితే జోగి రమేష్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలానే టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపతయాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, ఉపాధ్యక్షుడు మామిడాల మధు, నాయకులు ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్‌, పనబాక భూలక్ష్మి, పొత్తూరు శైలజ, జలదంకి సుధాకర్‌, షేక్‌ అమృల్లాలు చంద్రబాబు నివాసంపై దాడిని ఖండిస్తున్నట్లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. 

నెల్లూరులో జోగి రమేష్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెలుగుయువత నాయకులు