నిర్బంధించినా..

ABN , First Publish Date - 2021-10-22T05:21:02+05:30 IST

తెలుగుదేశం కార్యాలయంపై జరిగిన దాడికి గళ మెత్తుతూ మొదటి రోజు బంద్‌కు దిగుతున్న వారిని గడప దాటకుండా పోలీసులు నిర్బంధించారు. అదేతీరు గురు వారం రెండో రోజు కొనసాగింది.

నిర్బంధించినా..
మంగళగిరిలో జరిగిన దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

ఆంక్షలు..అడ్డుగోడలు అధిగమించి అధినేత దీక్షకు మద్దతు

ఏలూరు వద్ద బుచ్చియ్య చౌదరి పోలీసుల మధ్య వాగ్వాదం

కొవ్వూరు ఎస్‌ఐ, సీఐలపై టీడీపీ  నేత జవహర్‌ ఫిర్యాదు

గృహ నిర్బంధాల్లో ఎమ్మెల్యే, కన్వీనర్లు 

అడుగడుగునా పోలీస్‌ నిఘా...గడపదాటనీయకుండా ఆంక్షలు 


అడుగడుగునా పోలీసుల నిర్బంధం. ఎమ్మెల్యేలైనా, మాజీ మంత్రులైనా, ఆఖరికి టీడీపీ కార్యకర్త అయినా గడప దాటడానికి వీలులేకుండా ఆంక్షలు విధించారు. వారి నివాసాల చుట్టూ పోలీసుల పహరా కాశారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా రెండు రోజులుగా ఎక్కడికక్కడ నిర్బంధాలు విధించారు. జిల్లావ్యాప్తంగా గురువారం కూడా గృహ నిర్భంఽధాలు కొనసాగాయి. మంగళగిరిలో చంద్రబాబు దీక్ష వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా అడుగడుగునా నిఘా పెట్టారు. అయినప్పటికీ కొందరు నేతలు పోలీసుల కన్ను గప్పి  మంగళగిరి చేరుకుని పార్టీ అఽధినేత దీక్షకు మద్దతు పలికారు.


(ఏలూరు–ఆంధ్రజ్యోతి) :

తెలుగుదేశం కార్యాలయంపై జరిగిన దాడికి గళ మెత్తుతూ మొదటి రోజు బంద్‌కు దిగుతున్న వారిని గడప దాటకుండా పోలీసులు నిర్బంధించారు. అదేతీరు గురు వారం రెండో రోజు కొనసాగింది. మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షకు ఎవరూ వెళ్లకుండా నిరోధించే క్రమంలో ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. నాయకులు, కార్యకర్తల కదలికలపై నిఘా ఉంచారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజును ఆయన నివాసంలోనే నిర్బంధించారు. ఆయన వ్యక్తిగత పనిమీద బయటకు వెళతానని చెప్పినా ఖాతరు చేయలేదు. ఏలూరులో పార్టీ నేత పాలి ప్రసాద్‌ను, ఆంజనేయులును రాత్రికి రాత్రే నిర్బంధం లోకి తీసుకున్నారు. పార్టీ కన్వీనర్లను ముందుకు కదల నివ్వలేదు. తాడేపల్లిగూడెంలో పార్టీ కన్వీనర్‌ వలవల బాబ్జీని నిర్బంధించి తరువాత వదిలి పెట్టారు. ఇదే ప్రాంతా నికి చెందిన టీడీపీ నేత గొర్రెల శ్రీధర్‌ పోలీసుల కన్ను గప్పి మంగళగిరి చేరారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని కుక్కునూరు, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అనేక మందిని ముందుగానే కట్టడి చేశారు. నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ను నిరోధిం చారు. గోపాలపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును రెండోరోజు గృహ నిర్బంధంలోనే ఉంచారు. గోపాలపురంలో పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. భీమవరంలో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు సీతారామలక్ష్మిని, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావును పోలీసులు పూర్తిగా కట్టడి చేయగా, కార్యకర్తలు మాత్రం నిరసనలు కొనసాగించారు. పాలకోడేరు, ఉంగుటూరులో టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. తణుకు నియోజకవర్గంలో పలుచోట్ల చంద్రబాబుకు మద్దతుగా కార్యకర్తలు దీక్షకు దిగారు. 


పోలీసుల కన్నుగప్పి.. 

ఓ వైపు పోలీసు నిర్బంధం కొనసాగుతుండగా తమ అధినేత చేస్తున్న దీక్షకు స్వయంగా వెళ్లి మద్దతు పలకాలన్న కాంక్షతో కొందరు నేతలు కాస్తంత ఽధైర్యం చేశారు. బుధవారం పొద్దుపోయిన తరువాత పోలీసుల కన్ను గప్పి మూడో కంటికి తెలియకుండా నేరుగా వాహనాల్లో మంగళగిరి వైపు సాగి పోయారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఏలూరు కన్వీనర్‌ బడేటి చంటి, మంగళగిరి వెళ్లి దీక్షకు స్వయంగా మద్దతు పలికారు. నరసాపురం నేత బండారు మాధవనాయుడు, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సైతం ఈ తరహాలోనే వ్యవహ రించారు. మంగళగిరి చేరుకునేందుకు కొందరు పార్టీ సీని యర్లు శతవిధాలా ప్రయత్నించినా పోలీసులు అడ్డుతగిలారు. రాజమహేంద్రవరం నుంచి మంగళగిరి వైపు వెళ్తున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఏలూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వ్యక్తిగత పనుల మీద సచివాలయానికి వెళ్తున్నానని ఆపడానికి మీరు ఎవరంటూ బుచ్చియ్య చౌదరి పోలీసులపై విరుచుకు పడ్డారు.ఇదే క్రమంలో తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి జవహర్‌ కొవ్వూరు సీఐ, ఎస్‌ఐలపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. 




Updated Date - 2021-10-22T05:21:02+05:30 IST