అరాచకంపై ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-21T05:05:24+05:30 IST

గృహ నిర్బంఽధాలు... వీధుల్లో దిష్టిబొమ్మల దహనం.. పార్టీ శ్రేణుల నిరసన.. పోలీసుల ప్రతిఘటింపు.. షాపుల మూసివేత వంటి దృశ్యాలు బుధవారం చోటు చేసుకున్నాయి.

అరాచకంపై ఆగ్రహం

జిల్లా అంతటా కదిలిన పసుపు దండు

జిల్లావ్యాప్తంగా ధర్నాలు.. బంద్‌ ప్రశాంతం

ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధం

వీధుల్లోకి రానీయకుండా పోలీసుల ఆంక్షలు

 క్యాడర్‌ మాత్రం వీధుల్లోనే..

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన వీధులు


గృహ నిర్బంఽధాలు... వీధుల్లో దిష్టిబొమ్మల దహనం.. పార్టీ శ్రేణుల నిరసన.. పోలీసుల ప్రతిఘటింపు.. షాపుల మూసివేత వంటి దృశ్యాలు  బుధవారం చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్‌లో భాగంగా పశ్చిమ అంతటా ఇవే దృశ్యాలు కన్పించాయి. అనేక చోట్ల దుకాణాలు మూతపడ్డాయి. సినిమా హాళ్లు తెరచుకోలేదు. గృహనిర్బంధం నుంచి తప్పించుకుని వీధుల్లోకి వచ్చేందుకు టీడీపీ నాయకులు  విఫలయత్నం చేశారు. పోలీసుల  ప్రతిఘటనల మధ్య జిల్లా అంతటా బంద్‌ ప్రశాంతంగా జరిగింది. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి) : 

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, నేతలపై వైసీపీ నాయకుల భౌతికదాడులకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు తెలుగుదేశం పిలుపునిచ్చింది. ఈక్రమంలోనే జిల్లా అంతటా మధ్యాహ్నం వరకు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారు జామునుంచే తెలుగుదేశం సీనియర్లను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. బంద్‌ ఏమాత్రం జరగకుండా ఎక్కడికక్కడ క్యాడర్‌ను నిలువరించారు. ఆఖరికి ఎమ్మెల్యేలను సైతం గడప దాటనీయకుండా అడ్డుకున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు తన నివాసం నుంచి వీధుల్లోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. బందోబస్తులో ఉన్న పోలీసుల అడ్డంకులను దాటి బయటకు  దూసుకువచ్చారు. ఆయనకు అండగా పార్టీ క్యాడర్‌ కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసం వైపు చొచ్చుకు వచ్చారు. ఎమ్మెల్యేను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు అనుమతించే ప్రశ్నే లేదని పోలీసులు  ప్రకటిస్తూనే క్యాడర్‌ను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పాలకొల్లులో బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. దుకాణాలను మూసి వేశారు. తెలుగు దేశం అనుకూల  వైసీపీ వ్యతిరేక  నిదానాలతో హోరెత్తించారు. ఉండి  ఎమ్మెల్యే రామరాజు సైతం తన నియోజకవర్గంలో బంద్‌ను పర్యవేక్షించేందుకు నివాసం నుంచి బయలుదేరగా ఆయనను పోలీసులు నిలువరించారు. గృహ  నిర్బంధంలోకి తీసుకున్నారు. బయటకు వెళ్ళేందుకు వీలులేదని శాసించారు. అయినా వెళ్ళి తీరుతానని ఎమ్మెల్యే రామరాజు పోలీసులతో వాగ్వివాదం చేశారు. దుగ్గిరాలలో మాజీ ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయనకు అండగా క్యాడర్‌ నిలబడింది. దీంతో కొంతసేపు పోలీసులకు, క్యాడర్‌కు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకున్నది.  నియోజకవర్గ కన్వీనర్లు బడేటి చంటి, వలవల బాబ్జీ, బురగం శ్రీనివాసరావు, రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు  బూరుగుపల్లి శేషారావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, భీమవరంలో పార్టీ సీనియర్‌ నేత తోట సీతారామలక్ష్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 

గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, పోలీసులకు మధ్య  వాగ్వాదం జరిగింది. భీమడోలు తన నివాసంలో ఉన్న ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయు లును అక్కడే నిలువరించారు. చేసిందంతా ప్రభుత్వం. మమ్ములను అదుపులోకి ఎలా తీసుకుంటారంటూ గన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. నరసాపురంలో కన్వీనర్‌ రామరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు  మిగతా నేతలంతా బంద్‌లో పాలుపంచుకున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిగూ డెం, పెంటపాడుల్లో కూడా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బంద్‌కు ప్రయత్నించగా వలవల బాజ్జీ, గొర్రెల శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే  బూరుగుపల్లి శేషారావును కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును దేవరపల్లిలోనూ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణను కైకరం వద్ద అరెస్టు చేసి తణుకులో గృహ నిర్బంధం చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ క్యాడర్‌, నేతలు కదంతొక్కారు. అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను ఐదు గంటల వరకు విడుదల చేయకపోవడంతో జంగారెడ్డిగూడెం స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

ఎక్కడికక్కడ బంద్‌

దాదాపు అన్ని మండల కేంద్రాల్లోనూ, మేజర్‌ పంచాయతీల్లో కూడా బుధవారం టీడీపీ బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆర్టీసీ బస్టాండ్ల ఎదుట పోలీసులు మోహరించారు. ఆ వైపు ఎవరు రాకుండా గట్టిగానే నిలువరించారు. తెల్లవారు జాము నుంచి పొద్దుపోయే వరకూ పోలీస్‌ యాక్షన్‌ ఒకవైపు, తెలుగుదేశం దూకుడు మరోవైపు కొనసా గుతూనే వచ్చింది. బంద్‌లో సీనియర్లతోపాటు తాజాగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు, మండల కమిటీ అధ్యక్షులు, నియోజకవర్గాల నేతలు పాల్గొన్నారు. దాదాపు వీధులన్నీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.










Updated Date - 2021-10-21T05:05:24+05:30 IST