సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించారు

ABN , First Publish Date - 2021-07-25T05:26:07+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు తప్ప, ఈ ప్రభుత్వం ఎక్కడా రోడ్లపై ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు ఆరోపించారు.

సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించారు
రోడ్డు గుంతల్లో వరినాట్లు వేసి నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు

గత ప్రభుత్వంలో వేసినరోడ్లు తప్ప ఎక్కడా వేయలేదు

రోడ్లు గుంతల్లో వరినాట్లు వేసి టీడీపీ నేతల నిరసన

గుంటూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు తప్ప, ఈ ప్రభుత్వం ఎక్కడా రోడ్లపై ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు ఆరోపించారు. టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు వైసీపీ పాలనలో రోడ్ల అధ్వానంపై నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం పార్టీ నేతలు గుంటూరు  పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలకలూరు రోడ్డు, రత్నగిరి నగర్‌లో నిరసన ప్రదర్శనలు చేశారు. గుంటూరు పశ్చిమ ఇనచార్జ్‌ కోవెలమూడి రవీంద్ర, ఇతరనేతలతో కలిసి రోడ్లపై ఉన్న గుంతల్లో వరినాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు ప్రయాణానికి వీలులేకుండా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందన్నారు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురావడం లేదన్నారు. సంక్షేమంపేరుతో ప్రభుత్వం సంక్షోభం సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు డొల్లతనంగా ఉన్నాయని, సంక్షేమం కంటే ప్రజలపై వేసే పన్ను భారమే ఎక్కువగా ఉందని ప్రత్తిపాటి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే  శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ వైసీపీ పాలన రివర్స్‌గేర్‌లో నడుస్తోందన్నారు. రోడ్ల అభివృద్ధి నాగరికతకు చిహ్నమని అటువంటి రోడ్లు ఈరోజు ఏ దుస్థితిలో ఉన్నాయో ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. గత టీడీపీ  ప్రభుత్వ హయాంలో రూ.6,532 కోట్లతో 25,194 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారని, రాష్ట్రవ్యాప్తంగా 2,737.78 వేల కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశారని గుర్తుచేశారు. గుంటూరు పశ్చిమ ఇనచార్జ్‌ కోవెలమూడి రవీంద్ర (నాని) మాట్లాడుతూ నగరంలోని రోడ్ల దుస్థితిపై ఉద్యమం తప్పదని, ఇప్పటికైనా ప్రభుత్వ మేలుకొని పరిస్థితులు చక్కదిద్దాలని కోరారు. కార్యక్రమంలో నేతలు మన్నవ మోహనకృష్ణ, మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, నూకవరపు బాలాజి, మానం పద్మశ్రీ, మేడికొండూరు హనుమాయమ్మ, పొన్నగంటి శ్రీనివాసరావు, నాయుడు ఓంకార్‌, షేక్‌ రుస్తుంబాబు, అన్నాబత్తుని జయలక్ష్మి, రావిపాటి సాయికృష్ణ, మన్నవ వంశీకృష్ణ, అడకా శ్రీనివాసరావు, కసుకుర్తి హనుమంతరావు, మోహనరావు మాస్టారు, సింగంశెట్టి వీరయ్య, వల్లింశెట్టి వీరయ్య, లంకా ఉదయ్‌, చింతకాయల రామారావు, లంకా మాధవి, పొపూరి నరేంద్ర, బెల్లంకొండ సురేస్‌, కమ్మసాని బాజి, కంచర్ల సాంబశివరావు, యు.సాంబయ్య, షేక్‌ నాగూర్‌వలి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:26:07+05:30 IST