నేటి నుంచి ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు

ABN , First Publish Date - 2021-12-01T06:09:42+05:30 IST

అన్ని నియోజకవర్గాల పరిధిలో బుధవారం నుంచి 15 రోజులు పాటు ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు నిర్వహించనున్నట్లు టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

నేటి నుంచి ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు
సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రావణ్‌కుమార్‌, మంతెన సత్యనారాయణరాజు, అశోక్‌బాబు తదితరులు

గుంటూరు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): అన్ని నియోజకవర్గాల పరిధిలో బుధవారం నుంచి 15 రోజులు పాటు ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు నిర్వహించనున్నట్లు టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన అధ్యక్షతన ముఖ్యనాయకులు సమావేశం నిర్వహించారు. జోనల్‌ కో ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణరాజు, అశోక్‌బాబుతో పాటు జిల్లా ముఖ్యనేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, మహ్మద్‌నసీర్‌, పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మంతెన మాట్లాడుతూ సభలో చంద్రబాబు సతీమణికి జరిగిన అవమానం యావత్‌ మహిళాలోకానికి జరిగినట్లేనన్నారు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతి బూత్‌లో బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించాల్సిందగా సూచించారు.  మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ  ఆర్థిక నిర్వహణ సరిగా లేక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అందితే అక్కడ దోచేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నేతలు గింజుపల్లి వెంకటేశ్వరరావు, నాయుడు ఓంకార్‌, కార్యాలయ కార్యదర్శి కంచర్ల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. 

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కమిటీ ప్రమాణ స్వీకారం

నూతంగా ఏర్పాటై పార్లమెంటరీ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కమిటీ చేత శ్రావణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ అధ్యక్షత వహించారు.  శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, దీనిపై టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నిరంతర పోరాటం చేయాలన్నారు.  పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎయిడెడ్‌ విద్యాసంస్థల కోసం ప్రభుత్వంపై టీఎన్‌ఎస్‌ఎఫ్‌ చేసిన పోరాటం ఆదర్శనీయమన్నారు. యువత నేత మన్నెం శివనాగమల్లేశ్వరరావు, నేతలు గుంటుపల్లి మధుసూదనరావు, రాయపాటి అమృతరావు, కుంచకర్ల ధర్మతేజ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T06:09:42+05:30 IST