భగ్గుమన్న తమ్ముళ్లు

ABN , First Publish Date - 2021-10-20T06:14:48+05:30 IST

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం సహ పలు కార్యాలయాలపైన, విజయవాడలో టీడీపీ నేత పట్టాభి ఇంటిపైన దాడులతో జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు.

భగ్గుమన్న తమ్ముళ్లు
వినుకొండలో కార్యకర్తల ర్యాలీ

వైసీపీ మూకల దాడేనని ఆగ్రహం

పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, ప్రదర్శనలు

గుంటూరు కార్యాలయంపైకి వస్తారన్న ప్రచారం

పెద్దసంఖ్యలో టీడీపీ కార్యాలయానికి చేరుకున్న నేతలు

ఈపూరు మండలంలో కొవ్వొత్తులతో టీడీపీ శ్రేణుల నిరసన

తుళ్లూరు, తాడేపల్లి, అమృతలూరు, వినుకొండ, ముప్పాళ్లలో రాస్తారోకో



ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌, అక్టోబరు 19: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం సహ పలు కార్యాలయాలపైన, విజయవాడలో టీడీపీ నేత పట్టాభి ఇంటిపైన దాడులతో జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి ఎక్కడికక్కడ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కి నిరసనలు తెలిపాయి. దాడులను ఖండిస్తూ ఈపూరు మండలంలోని పలు గ్రామాల్లో  కొవ్వొత్తులతో టీడీపీ శ్రేణుల నిరసన ప్రదర్శన నిర్వహించాయి. తుళ్లూరు, తాడేపల్లి, అమృతలూరు, వినుకొండ, ముప్పాళ్ల తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో పోలీసులు సర్ది చెప్పేందుకు రాగా వారిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

- టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీలు దాడి చేయడం దుర్మార్గం అంటూ తుళ్లూరులో టీడీపీ నాయకులు మండిపడ్డాయి. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తుళ్లూరులో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వారించినా వారు వినలేదు. మీరే దగ్గర ఉండి వైసీపీ రౌడీలను దాడికి పంపారా.. అంటూ రాస్తారోకో విరమించాలన్న పోలీసులను ప్రశ్నించారు. మహిళలు కూడా సంఖ్యలో రోడ్డు పైకి వచ్చి నిరసనలు తెలిపారు.

- వైసీపీ మూకల చర్యలను ఖండిస్తూ తాడేపల్లి టీడీపీ నేతలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడుల విషయం తెలుసుకుని అనేక గ్రామాల ప్రజలు, పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చి అక్కడి దృశ్యాలను చూసి విస్మయానికి గురయ్యారు. 

- అమృతలూరులోని శ్రీప్రసన్నాంజనేయస్వామి గుడి సెంటర్‌లో తెనాలి - చెరుకుపల్లి ప్రధాన రహదారిపై టీడీపీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి డౌన్‌డౌన్‌, ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా, కార్యాలయాలపై దాడులు అరాచకం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. 

- వినుకొండలో టీడీపీ కార్యాలయం నుంచి బస్టాండ్‌ మీదగా శివయ్యస్తూపం సెంటర్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివయ్యస్తూపం సెంటర్‌లో నల్లజెండాలతో ఆందోళన చేశారు. 

రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైసీపీ దాడులకు నిరసనగా ఈపూరు మండలంలోని పలు గ్రామాలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ముప్పాళ్ళ గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

- ముప్పాళ్లలో టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అరాచకాలు నశించాలని, చేతకాని సీఎం అంటూ నినాదాలు చేశారు. సుమారు అరగంటకు పైగా రోడ్డుపై ధర్నా చేయడంతో పెద్దసంఖ్యలో రోడ్డుపై వాహనాలు బారులుతీరాయి. ఎస్‌ఐ పట్టాభిరామయ్య నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు.

- చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. పట్టణంలోని నరసరావుపేట రహదారిలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. నాదెండ్ల మండలం సాతులూరు వద్ద గుంటూరు-కర్నూలు రాష్ట్రీయ రహదారిపై నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగి పెద్దఎత్తున వైసీపీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

- దాడులను నిరసిస్తూ పెదనందిపాడులో తెలుగు యువత ఆధ్వర్యలోఓ పాతబస్టాండ్‌ సెంటర్లో రాస్తారోకో జరిగింది. దాడులకు తెగబడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్‌ చేశారు.   


బీభత్సకాండ

రాళ్లు, రాడ్లు, కర్రలతో కార్యాలయంపై దాడి

ప్రధాన గేటు విరగ్గొట్టి మరీ చొచ్చుకొచ్చిన మూకలు

అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం.. అడ్డుకున్న వారిపై దాడి


జాతీయ రహదారిపైన.. పక్కనే రాష్ట్ర పోలీస్‌ బాస్‌ కార్యాలయం.. అయినా బరితెగించిన ముష్కరులు మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి 15 నిమిషాలు బీభత్సకాండ సృష్టించారు. ప్రధాన గేటును వాహనాలతో ఢీకొట్టి మరీ లోనికి దూసుకువచ్చారు. రాళ్లు, రాడ్లు, కర్రలతో అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన వారిని కర్రలు, రాడ్లతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. సుమారు 30కిపైగా వాహనాల్లో 200 మంది వరకు రౌడీమూకలు టీడీపీ కార్యాలయంలో 15 నిమిషాలకుపైగా స్వైరవిహారం చేశాయి. సినీఫక్కీలో జరిగిన ఈ దాడిలో మహిళలు సైతం ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వీరంతా డీజీపీ కార్యాలయం వైపున ఉన్న సర్వీసు రోడ్డు మీదుగా రాంగ్‌ రూటులో టీడీపీ కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చారు.   దాడి జరుగుతున్న సమయంలో కార్యాలయపు రెండో అంతస్తులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఉన్నారు. దీంతో రెండో అంతస్తులోకి వెళ్లే ప్రయత్నం చేయగా డోర్లు తెరుచుకోకపోవడంతో ముష్కరులు వెనుతిరిగి వెళ్లారు. మూకలను అడ్డుకునేందుకు యత్నించిన కార్యాలయ సిబ్బంది బద్రి, అనిల్‌, విశాఖపట్నం డిప్యూటీ మేయర్‌ దొరబాబు, గుంటూరు టీడీపీ పార్లమెంటు వ్యవహారాల ఇన్‌చార్జి విద్యాసాగర్‌లపై దాడి చేశారు. దాడిని ఖండిస్తూ టీడీపీ నేతలు కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డుపై గంటపాటు రాస్తారోకో చేశారు. కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబునాయుడు దాడి జరిగిన తీరును గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాహనాలతోపాటు కార్యాలయంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, సంగం చైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్రకుమార్‌, పెద్దసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకుని విధ్వంసాన్ని పరిశీలించి విస్మయం వ్యక్తం చేశారు. విజయవాడ నగరానికి చెందిన ఓ కార్పొరేటర్‌ అనుచరులతోపాటు గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ, మరో ఎమ్మెల్సీ అనుచరగణం ఈ దాడిలో పాల్గొన్నట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.


పోలీసుల ప్రేక్షకపాత్ర

టీడీపీ కార్యాలయం సమీపంలోని సీకే కన్వెన్షన్‌ వద్ద పెద్దసంఖ్యలో వాహనాలు ఆపి, మూకలు చేరి మద్యం తాగుతుండటాన్ని కొంతముందు టీడీపీ శ్రేణులు గమనించాయి. అనుమానం కలిగిన వారు వెంటనే పోలీసులకు ఫోనులో సమాచారం అందించారు. అయితే, మంగళగిరి రూరల్‌ సీఐ భూషణం పరిమితమైన సిబ్బందితో సకాలంలో అక్కడికి వచ్చారు. అయితే పెద్దసంఖ్యలో కర్రలు, రాడ్లతో దూసుకువచ్చిన మూకలను కట్టడి చేయలేక పోయిన పోలీసులు  ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. 


జిల్లా కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులతో గుంటూరులోని టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పెద్దసంఖ్యలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు నేతలు అక్కడే ఉన్నారు. పశ్చిమ ఇన్‌చార్జ్జి కోవెలమూడి రవీంద్ర నేతృత్వంలో నేతలు చాలాసేపు కార్యాలయంలోనే ఉండే మంతనాలు చేశారు. 

  

అప్రమత్తమైన పోలీసులు

టీడీపీ కార్యాలయంపై దాడులతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా జిల్లాలోని వైసీపీ కార్యాలయాలు, వైసీపీ ముఖ్య నాయకుల ఇళ్ల వద్ద పికెట్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్‌ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని రకాలైన ముందు జాగ్రతత్త చర్యలు తీసుకోవాలని అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు ఆదేశాలు జారీ చేశారు.   నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ఇరుపార్టీల శ్రేణుల నుంచి సమాచారం సేకరిస్తున్నాయి. గొడవలకు, అల్లర్లకు అవకాశం ఉండే ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. 

 

నేటి బంద్‌ జయప్రదానికి పిలుపు

టీడీపీ కార్యాలయాలపైన, నేతల ఇళ్లపైన వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ బుధవారం బంద్‌కు పిలుపిచ్చింది. ఈ క్రమంలో బంద్‌ను జయప్రదం చేయాలని జిల్లాకు చెందిన పలువురు నేతలు ప్రజలను కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, అందుకే బంద్‌ చేస్తున్నట్లు అందుకు అందరూ సహకరించాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. 


ప్రజాస్వామ్యమా.. రౌడీ రాజ్యమా

దాడులపై టీడీపీ నేతల ఆగ్రహం

టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులు చూస్తేంటే ఇది ప్రజాస్వామ్య పాలనలా లేదని.. రౌడీరాజ్యంలా ఉందని పలువురు టీడీపీ నాయకులు మండిపడ్డారు. వైసీపీ మూకల చర్యలతో ప్రభుత్వం పతనావస్థకు దగ్గరగా ఉందని అర్థమవుతుందన్నారు. అరాచక, అవినీతి, ఫ్యాక్షనిస్టు పరిపాలన ఏ విధంగా జరుగుతుందో ఈ ఘటనలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఫ్యాక్షనిస్టు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 

- పక్కా ప్రణాళికతోనే వైసీపీ నేతలు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ  అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తెలిపారు. దాడులకు సీఎం, డీజీపీ బాధ్యత వహించాలన్నారు. 

- ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లగా శాంతి భద్రతలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్రతో పాటు టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల జోసఫ్‌ ఇమ్యానియల్‌(మ్యానీ) డిమాండ్‌ చేశారు.

- ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం తప్పా అని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా తాము చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఇటువంటి దాడులు చేయడం ఏమిటన్నారు. 

- అవినీతిని ఎత్తిచూపితే దాడులు చేస్తారా అని మాజీమంత్రి డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య మండిపడ్డారు. పక్కా ప్రణాళికతోనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడుల జరిగాయని అరోపించారు.   

- రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు చేయడంతో పాటు కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు.    

Updated Date - 2021-10-20T06:14:48+05:30 IST