తమ్ముళ్లలో.. అమృతోత్సాహం

ABN , First Publish Date - 2022-08-14T05:30:00+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగే వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

తమ్ముళ్లలో.. అమృతోత్సాహం
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రులు ఆనందబాబు, పుల్లారావు, ఎమ్మెల్యే అనగాని తదితరులు

నేడు టీడీపీ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ వేడుకలు 

హాజరుకానున్న చంద్రబాబు.. గుంటూరులో భారీ ఏర్పాట్లు

 

గుంటూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగే వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించాలని భావించిన టీడీపీ అధిష్ఠానం అందుకు అనుగుణంగా సభా వేదికను ముస్తాబు చేయించింది. ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్న నేపథ్యంలో మూడు రోజులుగా పార్టీ  శ్రేణులు కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమైఉన్నారు. స్థానిక చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలోని వేదిక ఏర్పాట్లు ఆదివారం సాయంత్రానికి తుదిదశకు చేరుకున్నాయి. అమృత్‌ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా పదివేల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని నాయకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 


కార్యక్రమం ఇలా..

సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకల్లా చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా గుంటూరు చేరుకుంటారు. కలెక్టరేట్‌, పట్టాభిపురం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదగా జూట్‌ మిల్‌ సెంటర్‌ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి స్వామి థియేటర్‌ మీదగా వేదిక వరకు సాగే ప్రదర్శనలో జాతీయ పతాకాన్ని చేబూని కార్యకర్తలతో కలిసి ఆయన నడుస్తారు. ఆజాదీ కా అమృత్‌ కార్యక్రమంలో భాగంగా పతాకావిష్కరణ, జెండా వందనం చేస్తారు. కార్యకర్తల కవాతు, ఎన్‌సీసీ పెరేడ్‌లు నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడు కోసం ఒక వేదిక, పొలిట్‌ బ్యూరో సభ్యులు, పార్లమెంట్‌ ఇన్‌చార్జిలు, ఇతర ముఖ్య నేతల కోసం మరో రెండు వేదికలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. దేశభక్తి గీతాలు, జాతీయ భావాలను పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యరూపకాలు ప్రదర్శించనున్నారు. వేడుకల సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఆదివారం సాయంత్రం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు.  

Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST