రాళ్లదాడి, కరెంటు కట్‌పై దర్యాప్తు జరిపించండి

ABN , First Publish Date - 2021-04-16T09:57:46+05:30 IST

తిరుపతి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడి, సత్యవేడులో ఆయన సభకు విద్యుత్‌ సరఫరా నిలిపివేతపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర

రాళ్లదాడి, కరెంటు కట్‌పై దర్యాప్తు జరిపించండి

వైసీపీ తరఫున వలంటీర్ల ప్రచారం

కేంద్ర బలగాలను నియమించాలి

ఈసీకి టీడీపీ ఎంపీల వినతి


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడి, సత్యవేడులో ఆయన సభకు విద్యుత్‌ సరఫరా నిలిపివేతపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఆ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌ విజ్ఞప్తి చేశారు గురువారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్రతో వారు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చంద్రబాబుపై దాడితో పాటు వైసీపీ అధికార దుర్వినియోగంపై ఈ నెల 13న ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ నుంచి స్పందన రాలేదన్నారు. ఎన్నికల కోసం గ్రామ వలంటీర్లను వైసీపీ ఉపయోగిస్తోందని.. వారు అధికార పక్ష కరపత్రాలను పంచుతున్నారని తెలిపారు. వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవని ప్రజలను బెదిరిస్తున్నారని చెప్పారు.


తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లేని పుంగనూరు, చంద్రగిరి, నగరి, నెల్లూరు, కావలి తదితర నియోజకవర్గాల వారిని వైసీపీ నేతలు తీసుకొస్తున్నారని.. వారితో మద్యం, డబ్బు పంపిణీ చేయిస్తున్నారని తెలిపారు. గురువారం రాత్రి 7 గంటల నుంచే స్థానికేతరులను పంపించివేయాలని అభ్యర్థించారు. ఎన్నికల్లో కేంద్ర బలగాలను వినియోగించాలని, అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కెమెరాలను ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణకు మైక్రో అబ్జర్వర్లను నియమించాలని కోరారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు ఒక పర్యవేక్షకుడిని నియమించాలని, తెలుగు రాష్ట్రాలకు చెందనివారిని నియమించాలని సూచించారు. మద్యం, డబ్బు పంపిణీకి అడ్డుకట్ట వేయాలని.. డూప్లికేట్‌ ఓట్లను ఏరివేయాలని టీడీపీ నేతలు కోరారు.

Updated Date - 2021-04-16T09:57:46+05:30 IST