బాబాయ్.. మేమందరం మీ వెనకుంటాం : ఎంపీ రామ్మోహన్

ABN , First Publish Date - 2020-10-20T03:21:19+05:30 IST

టీడీపీ కమిటీలను ఇవాళ ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే.

బాబాయ్.. మేమందరం మీ వెనకుంటాం : ఎంపీ రామ్మోహన్

శ్రీకాకుళం : టీడీపీ కమిటీలను ఇవాళ ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణను నియమిస్తూ ఈ మేరకు ఓ ప్రకటనలో అధిష్టానం తెలిపింది. అంతేకాదు.. 27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు.. 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అచ్చెన్నకు పలువురు తెలుగు తమ్ముళ్లు, ద్వితియ శ్రేణి నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా.. బాబాయ్‌(అచ్చెన్నాయుడు)కు అధ్యక్ష పదవి ఇవ్వడంపై అబ్బాయ్ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.


మీ వెనుక మేముంటాం..!

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించబడిన అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి బాబాయ్ స్థైర్యం, ఎవరికీ భయపడని గుండెబలం, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం చూస్తూ పెరిగాను. పార్టీని ముందుకి తీసుకెళ్లే కృషిలో మేమందరం మీ వెనకుంటాం. జై తెలుగు దేశం జై హింద్!అని సోషల్ మీడియాలో రామ్మోహన్ నాయుడు రాసుకొచ్చారు.


రుణపడి ఉంటా..!

అదేవిధంగా తనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకుగాను చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నా పని తీరు మీద నమ్మకముంచి టీడీపీ జాతీయ కార్యదర్శిగా మళ్ళీ నియమించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు. ఓటములు అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఎదురొడ్డి నిలిచిన చరిత్ర తెలుగు దేశానిది. నా రాజకీయ ప్రస్థానానికి తోడ్పడిన కుటుంబం, పార్టీ కార్యకర్తలు, శ్రీకాకుళం జనానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను అని రామ్మోహన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


బాబును మళ్లీ సీఎం చేస్తా..!

కాగా.. టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటిసారిగా చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇన్ని రోజులుగా తనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టే కొంత గ్యాప్ ఇచ్చానని.. ఇకపై ప్రజా క్షేత్రంలోనే ఉంటానని అచ్చెన్న తెలిపారు. బలహీన వర్గాలను చైతన్యపరిచి ఏకం చేస్తానని.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతానని ఆయన చెప్పారు. తనకు దక్కిన హోదా బలహీనవర్గాలకు దక్కిన గౌరవం అని.. టీడీపీ బలహీనవర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. టీడీపీకి పూర్వవైభవం తెచ్చి.. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అచ్చెన్న స్పష్టం చేశారు.

Updated Date - 2020-10-20T03:21:19+05:30 IST