నగరపాలక ఎన్నికల్లో టీడీపీదే నైతిక విజయం

ABN , First Publish Date - 2021-03-04T06:05:49+05:30 IST

నగరపాలక ఎన్నికల్లో టీడీపీదే నైతిక విజయమని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ నగరపాలక ఎన్నికల్లో టీడీపీ తరపున 49 డివిజన్లకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. అయితే 37 డివిజన్లలో వైసీపీ పోలీసుల సహకారంతో ఏకగ్రీవాలు చేసుకుందని ఆరోపించారు.

నగరపాలక ఎన్నికల్లో టీడీపీదే నైతిక విజయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దొరబాబు

ప్రజల్లోకి వెళ్లి గెలవలేకనే ఏకగ్రీవాలు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైసీపీ

అధికారులు, పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు

ఎమ్మెల్సీ దొరబాబు


చిత్తూరు సిటీ, మార్చి 3: నగరపాలక ఎన్నికల్లో టీడీపీదే నైతిక విజయమని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ నగరపాలక ఎన్నికల్లో టీడీపీ తరపున 49 డివిజన్లకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. అయితే 37 డివిజన్లలో వైసీపీ పోలీసుల సహకారంతో ఏకగ్రీవాలు చేసుకుందని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. అభ్యర్థులు, ప్రపోజర్స్‌ లేకుండానే వారి సంతకాలను ఫోర్జరీ చేసి విత్‌డ్రా చేసుకున్నారని   విమర్శించారు. నామినేషన్లు వేసిన నాటినుంచి టీడీపీ అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్‌ చేస్తూనే ఉన్నారన్నారు. 15 మందికి పైగా టీడీపీ అభ్యర్థులపైన పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పనిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్‌ మాట్లాడుతూ వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులకు భయపడి చాలా మంది టీడీపీ అభ్యర్థులు, ప్రపోజర్స్‌ ఊరు వదలి వెళ్లిపోయారని అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే గెలవలేమనే వైసీపీ ఇలాంటి అక్రమాలకు పాల్పడిందని చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగివుంటే టీడీపీ భారీ మెజారిటీతో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునివుండేదన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన పోలీసులను, అధికారులను వదలబోమని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. టౌన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ షణ్ముగం మాట్లాడుతూ ఏకగ్రీవాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. అభ్యర్థులు, ప్రపోజర్స్‌ లేకుండానే విత్‌డ్రా చేయడం ఎంతవరకు సాధ్యమన్నారు. ఆధారాలతో కోర్టుకు వెళతామని, అక్రమంగా ఏకగ్రీవాలకు సహకరించిన ఎన్నికల అధికారులు, పోలీసులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. 




మాప్రమేయం లేకుండానే ఏకగ్రీవం చేసుకున్నారు


నామినేషన్‌ వేసిన రోజు నుంచి వైసీపీ నేతలు, పోలీసులు ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగారు. విత్‌డ్రా చేసుకోమని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. వీరి బెదిరింపులకు భయపడి మేము ఊరు వదిలి వెళ్లిపోయాం. మాప్రమేయం లేకుండా, మా ప్రపోజర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు. గత ఎన్నికల్లో నేను పోటీ చేసి గెలిచి కార్పొరేటర్‌గా ప్రజలకు సేవచేశా. వైసీపీ నేతలకు చిత్తశుద్ధి వుంటే ఎన్నికల్లో గెలిచి కారొరేటర్‌ పదవి దక్కించుకోవాల్సింది. 

- భార్గవి, 14వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి 



మా సంతకాలను ఫోర్జరీ చేశారు 


పోలీసులు, వైసీపీ నేతలు నామినేషన్‌ విత్‌ డ్రాచేసుకోమని బెదిరించారు. పోలీసులు ఇంటికి వచ్చి తనిఖీలు చేశారు. ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో నేను, నా ప్రపోజర్‌ తిరువన్నామలైకి వెళ్లి అక్కడే ఉన్నాం. మేము లేకుండానే మా సంతకాలను ఫోర్జరీచేసి ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు. ఎన్నికల్లో పోటీచేసి గెలవలేక ఇలా అడ్డదారుల్లో ఏకగ్రీవాలను ప్రకటించుకున్నారు. ఇది ఎందమాత్రం వారి విజయం కాదు.

- గోపి, 50వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి



ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు


వైసీపీ నేతలు, పోలీసులకు భయపడి నేను, మా ప్రపోజర్‌ రెండు రోజుల నుంచి తిరుమలలోనే వున్నాం. అందుకు తగిన ఆధారాలు కూడా మావద్ద వున్నాయి. మా సంతకాలను ఫోర్జరీ చేసి ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు. ఎన్నికల అధికారులు కూడా ఇవేమీ పరిశీలించకుండా ఏకపక్షంగా ఏకగ్రీవాలను ప్రకటించడం దారుణం. వైసీపీ నేతలు ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేక ఇలా అడ్డదారుల్లో ఏకగ్రీవాలను ప్రకటించుకున్నారు. ఇది ఎంతమాత్రం వాళ్ల విజయం కాదు.   

- లక్ష్మీపతి నాయుడు, 21వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి


Updated Date - 2021-03-04T06:05:49+05:30 IST