సీఎం జగన్ చేతకానితనం వల్లే కరెంట్ కష్టాలు: టీడీపీ ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-10-13T19:05:06+05:30 IST

సీఎం జగన్ చేతకానితనం, చేతివాటం వల్లే రాష్ట్రానికి కరెంటు కష్టాలు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ చేతకానితనం వల్లే కరెంట్ కష్టాలు: టీడీపీ ఎమ్మెల్సీ

అమరావతి: సీఎం జగన్ చేతకానితనం, చేతివాటం వల్లే రాష్ట్రానికి కరెంటు కష్టాలు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనం వద్దు... కమీషనే ముద్దు అనేది జగన్ రెడ్డి పాలసీ అని అన్నారు. కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీల పెంపుతో రైతులు సతమతమౌతున్నారన్నారు. కావలసినంత బొగ్గు నిల్వలున్నాయని కేంద్రం చెబుతుంటే బొగ్గు కొరత ఉందని జగన్ రెడ్డి ఎందుకు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఓవైపు కోతలతో రైతులు సతమతమవుతున్నారని, మోటార్లకు మీటర్లు పెడితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందని  అన్నారు. చంద్రబాబు విద్యుత్ లోటు రాకూడదని ఒక ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారన్నారు. ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారులపై అదనపు భారం వేయడం అమానుషమని మండిపడ్డారు. ప్రధాన సలహాలదారు సజ్జల ప్రభుత్వానికి సలహాలివ్వమంటే లైట్లు ఆపండి, ఏసీలు ఆపండి అంటూ ప్రజలకు ఉచిత సలహాలిస్తున్నారని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-13T19:05:06+05:30 IST