Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫలించిన టీడీపీ ఎమ్మెల్యేల కృషి.. ఇక కదిలించాల్సింది వైసీపీ నేతలే!

తేల్చాల్సిందే

వెలిగొండ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

స్పష్టం చేసిన కేంద్ర మంత్రి షెకావత్‌ 

ఢిల్లీలో మంత్రితో భేటీ  

వెలిగొండ ఆవశ్యకతపై సమగ్ర వివరణ 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): వెలిగొండ ప్రాజెక్టుకు నీటి వాటా హక్కు లభించాలంటే ఏం జరగాలో తేలిపోయింది. సాక్షాత్తూ కేంద్రమంత్రి షెకావత్‌ ఆ విషయాన్ని తేల్చిచెప్పారు. సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల చొరవను, ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇక చేయాల్సిందల్లా మీ రాష్ట్రప్రభుత్వమేనంటూ బాధ్యతను విడమరిచి చెప్పారు. గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు చేరాలన్నా తద్వారా నీటి వాటా లభించాలన్నా ఇప్పుడు కదలాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కదిలించాల్సింది జిల్లాలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే. లేదంటే విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు గత కొంతకాలం నుంచి చెప్తున్న విధంగా జిల్లాప్రజలు, ప్రత్యేకించి పశ్చిమప్రాంత వాసుల ఆశలు అడియాశ లవుతాయి. తద్వారా జిల్లాకు సాగునీటి వనరుల కల్పనలో ముఖ్యంగా జిల్లా ఏర్పాటు నాడు ఇచ్చిన హామీ అమలుకు తీరని అన్యాయం జరుగుతుంది. మరి ఇప్పటివరకూ టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన  కృషికి తోడు రాష్ట్రప్రభుత్వం కదులుతుందా..  జిల్లాలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు కదిలించే ప్రయత్నం చేస్తారా అనేది వేచిచూడాల్సిందే.


కేంద్ర జలవనరుల శాఖ ప్రకటించిన గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చేందుకు మార్గం ఏమిటో తేటతెల్లమైంది. అయితే రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో చొరవ తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. వివిధ కారణాలతో రాష్ట్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కాలక్షేపం చేసినా జిల్లాలోని వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు నోరు విప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా ప్రజల చిరకాల వాంఛ, జిల్లా ఏర్పాటు నాడు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరి కృష్ణాజలాలు పుష్కలంగా రావాలన్నా వెలిగొండ ప్రాజెక్టుకి గెజిట్‌లో స్థానం దక్కితేనే సాధ్యమవుతుంది. అయితే ఈ విషయంలో ఎదురవుతున్న సమస్యను, లోపాలను ఎత్తిచూపటంలో జిల్లాకు చెందిన టీడీపీ శాసనసభ్యులు తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సఫలీకృతులైనప్పటికీ మున్ముందు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


ప్రజానీకంలో ఆందోళన

జిల్లాలో కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు వ్యవహారం గత మూడు మాసాలుగా వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. తొలుత రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడిందనే సమస్యను జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డీఎస్‌బీవీ స్వామి లేవనెత్తిన విషయం తెలిసిందే. దీనిపై నేరుగా ముఖ్యమంత్రికి వారు లేఖ రాశారు. దానిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈసమయంలో కేంద్రం రెండు రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ప్రకటించిన గెజిట్‌లో వెలిగొండ పేరుని ఎత్తేశారు. దీంతో అసలు వెలిగొండకు నీటి కేటాయింపు హక్కు కోల్పోక తప్పదన్న భయం యావత్తు ప్రజానీకంలో నెలకొంది.


వేగంగా స్పందించిన టీడీపీ 

ఈ నేపథ్యంలో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు తొలుత గెజిట్‌లో వెలిగొండను చేర్చకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుకి నిధులు కేటాయించవద్దని కేంద్రానికి రాసిన లేఖకు అభ్యంతరం తెలుపుతూ అటు తెలంగాణ, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వవైఖరిని తూర్పారబడుతూ లేఖలు రాశారు. అంతటితో ఆగకుండా చివరికి కేంద్ర జలవనరుల శాఖామంత్రి షెకావత్‌ని మంగళవారం ఢిల్లీలో కలిసి సమస్య పరిష్కారానికి మరింత చొరవచూపారు. ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు జిల్లాలోని ఆపార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులను కూడా ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రమంత్రికి సమస్యను వివరించారు.  


గెజిట్‌లో చేర్చకుంటే కష్టమే

అటు కేంద్రమంత్రి చెప్పిన సమాచారం, అధికారికంగా అందుతున్న సమాచారం మేరకు గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు చేరాలంటే రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం చొరవ చూపకపోయినా కేంద్రమైనా ప్రాజెక్టుని గెజిట్‌లో చేర్చేందుకు అవకాశం లేకపోలేదు. నిజానికి వెలిగొండ రాష్ట్ర విభజన సందర్భంగా రూపొందించిన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టుల్లో ఉంది. అయితే ఇటీవల అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సాగునీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. తద్వారా భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు సంబంధం లేకుండా సాగునీటి వినియోగంపై చర్యలు తీసుకునే విధంగా కృష్ణా బేసిన్‌ బోర్డు ఏర్పాటుకాబోతోంది. ఆ సంస్థ గెజిట్‌లో ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే నీటి కేటాయింపు హక్కుని కల్పించే అవకాశం ఉంది. అది జరగాలంటే ఇప్పుడు గెజిట్‌లో వెలిగొండ పేరు చేరాల్సిందే. 


ఇప్పుడేం చేయాలి 

తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడేం చేయాలనే విషయాన్ని మాట్లాడుకుంటే కేంద్రమంత్రి షెకావత్‌ చెప్పిందే అసలైన పరిష్కారం. ప్రాథమికంగా ప్రకటించిన గెజిట్‌లో చేర్పులు, మార్పులు చేస్తూ ప్రతిపాదించేందుకు అభ్యం తరాలు తెలియజేసేందుకు ఆరు మాసాల సమయం ఇచ్చారు. ఈ సమయంలో వచ్చిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఫైనల్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెల్లడిస్తారు. అప్పటికీ వెలిగొండకు అక్కడ స్థానం లభించకపోతే ప్రాజెక్టుకు నీటి కేటాయింపు హక్కు లేనట్లే అవుతుంది. అయితే గెజిట్‌ ప్రకటించి ఇప్పటికే నెలన్నర గడిచిపోయింది. ఇంకో నాలుగున్నర నెలల సమయం మాత్రమే ఉంది. ఈ లోపు మీరు సమస్యను మా దృష్టికి తెచ్చి మంచిపని చేశారని షెకావత్‌ టీడీపీ బృందాన్ని ప్రశంసించారు. ఆ తరువాత ఇక మీ రాష్ట్రప్రభుత్వమే ఈ బాధ్యతను తీసుకోవాలి. అన్ని అంశాలను వివరంగా పేర్కొంటూ మాకు ప్రతిపాదనలు పంపాలి. తద్వారా చర్యలు తీసుకుంటాం అని స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తుందా లేదా అనేది తేలాలి. మీన మేషాలు లెక్కిస్తే కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఎత్తిపోతల పథకాలకు న్యాయం చేసేందుకు మన జిల్లాకు అన్యాయం చేసినట్లే అవుతుంది.


అధికారపార్టీ నేతలు నోరువిప్పాల్సిందే..

ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన అధికారపార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నోరు విప్పాల్సిన అగత్యం కనిపిస్తోంది. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంది. లేకుంటే జిల్లా ప్రజలు ముఖ్యంగా పశ్చిమప్రాంత ప్రజానీకం భావోద్వేగాలకు గురై ఆందోళనబాట పట్టే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా వెలిగొండను గెజిట్‌లో చేర్చాలని కేంద్ర మంత్రితో, సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి సిఫార్సు చేశారు. ఇటు టీడీపీ ఎమ్మెల్యేల ప్రయత్నానికి తోడు అటు ఉప రాష్ట్రపతి చొరవతో రాష్ట్రప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టుకి స్థానం దక్కే అవకాశం లేకపోలేదు. అయితే చివరికి ఏమి జరుగుతుందనేదే ప్రశ్నార్థకం.


Advertisement
Advertisement