అసెంబ్లీ నుంచి సస్పెండ్‌పై టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-17T17:25:35+05:30 IST

అసెంబ్లీ నుంచి ఒకరోజు సస్పెన్షన్‌‌పై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ నుంచి సస్పెండ్‌పై టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం

అమరావతి: అసెంబ్లీ నుంచి ఒకరోజు సస్పెన్షన్‌‌పై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పొలిట్ ‌బ్యూరో సభ్యులు చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద కుంభకోణం కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం అమ్మకాలని అన్నారు. వరుసగా 4వ రోజూ తెలుగుదేశం ఎమ్మెల్యేలను అసెంబ్లీలో సస్పెండ్ చేసి హైడ్రామా నడుపుతున్నారని మండిపడ్డారు. సస్పెండ్ చేయటంతో పాటు మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపించారని తెలిపారు. మార్షల్స్ సాయంతో సభను నడుపుకుంటూ ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. వాస్తవ విరుద్ధ ప్రకటనలతో సీఎం జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చినరాజప్ప వ్యాఖ్యలు చేశారు. 

రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ...  కల్తీ నాటుసారా బాధితులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్ధం కావట్లేదన్నారు. 10 మంది తెలుగుదేశం సభ్యుల్ని అసెంబ్లీలో అడ్డుకునేందుకు 50 మంది మార్షల్స్‌ వినియోగించారని తెలిపారు. 


ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ... ఏపీలో గంజాయి పంట తరహాలోనే నాటుసారా తయారీ జరుగుతోందన్నారు. కల్తీ నాటుసారా మరణాల్ని తగ్గించి చూపే ప్రయత్నం సీఎం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత గొంతు నొక్కాలనుకున్నా టీడీపీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. 


ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ... జంగారెడ్డి గూడెం తో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నాటుసారా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. కల్తీ నాటుసారా స్లో పాయిజన్ తరాహాలో ప్రజల ప్రాణాలు హరిస్తుంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదని మండిపడ్డారు. నాటుసారా, బెల్టుషాపులు నడుస్తున్నట్లు అధికారిక రికార్డులు ఉంటే సీఎం ఎలా అసత్యాలు చెప్తారని ప్రశ్నించారు. 

Updated Date - 2022-03-17T17:25:35+05:30 IST