పెద్దిరెడ్డి బలగాలతో ఉప ఎన్నిక

ABN , First Publish Date - 2021-04-19T09:46:39+05:30 IST

‘‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలగాలతో తిరుపతి ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని శనివారం జరిగిన ఉప ఎన్నికతో స్పష్టమైంది.

పెద్దిరెడ్డి బలగాలతో ఉప ఎన్నిక

మంత్రి రామచంద్రారెడ్డిని అరెస్టు చేయాలి 

జగన్‌ ప్రభుత్వాన్ని గవర్నర్‌ బర్తరఫ్‌ చేయాలి

స్వామి భక్తి చాటుకున్న డీజీపీ సవాంగ్‌: నిమ్మల


తిరుపతి(రవాణా), ఏప్రిల్‌ 18: ‘‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలగాలతో తిరుపతి ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని శనివారం జరిగిన ఉప ఎన్నికతో స్పష్టమైంది. తిరుపతి ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఏ విధంగా ఖూనీ చేసిందో రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచమంతా చూసింది’’ అని టీడీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తిరుపతిలో పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన బయట ప్రాంత వ్యక్తులు పెద్దిరెడ్డి కల్యాణ మండపంలో బసచేశారని ఆరోపించారు. 


వేలాది డూప్లికేట్‌ ఓటర్‌ ఐడీలు, నకిలీ ఐడీలు దొరికాయని, వీటిపై పెద్దిరెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. సీఈసీ కూడా ఉప ఎన్నికల విషయంలో ప్రేక్షకపాత్ర పోషించి పెద్దిరెడ్డికి రక్షణ కల్పించిందని విమర్శించారు. డీజీపీ తన స్వామి భక్తిని చాటుకోవడానికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన సమయమిస్తే గజమాలతో సన్మానిస్తామని చెప్పారు. పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఎన్నికల ప్రక్రియ చేసిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గవర్నర్‌ బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 


ప్రమాణం చేద్దామా: పనబాక 

ఉప ఎన్నికలో ఎవరు రిగ్గింగ్‌ చేశారో ప్రమాణం చేద్దామా? అంటూ టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సవాల్‌ విసిరారు. వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం(గురువారం) రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయాలన్నారు. డీజీపీ సీసీ కెమెరాలను ఆన్‌చేసి చూస్తే తిరుపతి నగరంలో ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. 

Updated Date - 2021-04-19T09:46:39+05:30 IST