కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: గోరంట్ల

ABN , First Publish Date - 2021-06-16T19:08:29+05:30 IST

కరోనా బారిన పడిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: గోరంట్ల

రాజమండ్రి: కరోనా బారిన పడిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. బుధవారం కరోనా బారిన పడిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ  రాజమండ్రి  అర్బన్ తహసిల్దార్ కార్యాలయం వద్ద గోరంట్ల నిరసన తెలిపారు. కరోన బాధితులకు న్యాయం చేయాలంటూ తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ కరోనా మృతుల లెక్కలను ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిన కరోనా మృతుల సంఖ్యకు స్మశాన వాటికల్లో మృతుల సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. కరోనా మృతుల దహన సంస్కారాలు కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల ఆర్థిక సహాయం ఇవ్వటం లేదని తెలిపారు.  కర్ఫ్యూ నేపథ్యంలో లక్షలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కరోనా వారియర్స్‌కు జీతాలు సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  కోట్లాది రూపాయలు అప్పులు చేస్తున్న ప్రభుత్వం కరోనా సోకిన వారిని ఆదుకోవటం లేదన్నారు. కరోనాతో మృతి చెందిన వారికి రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-06-16T19:08:29+05:30 IST