తెదాపా మహానాడుపై బర్మింగ్‌హమ్‌లో ఎన్నారై నేతల సమావేశం!

ABN , First Publish Date - 2022-04-25T21:28:33+05:30 IST

యూరొప్‌లోని వివిధ నగరాల్లో వచ్చే నెలలో నిర్వహించాల్సిన మహానాడు కార్యక్రమం గురించి బర్మింగ్‌హోమ్ నగరంలో సమావేశం జరిగింది.

తెదాపా మహానాడుపై బర్మింగ్‌హమ్‌లో ఎన్నారై నేతల సమావేశం!

మహానాడు అంటే టీడీపీ కార్యకర్తలకు పండుగలాంటిదే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ప్రతీ యేటా మే 28వ తారీఖున తెలుగు దేశం పార్టీ మహానాడును నిర్వహిస్తూ వస్తోందన్న సంగతి తెలిసిందే. విదేశాల్లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఈ మహానాడులో విరివిగా పాల్గొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే యూరొప్‌లోని వివిధ నగరాల్లో వచ్చే నెలలో నిర్వహించాల్సిన మహానాడు కార్యక్రమం గురించి బర్మింగ్‌హోమ్ నగరంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక సభ్యులంతా పాల్గొని కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న అంశాల గురించి చర్చించారు. 


ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చన్నాయుడు, ఎన్నారై టీడీపీ సెల్ పొలిటికల్ ఇంఛార్జి బుచ్చి రాంప్రసాద్, పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్థన్, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జూమ్ కాల్‌లో హజరయ్యారు. యూరప్‌లో ఎవరైతే  తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరులు, కార్యకర్తలు ఉన్నారో వారందరిని వ్యక్తిగతంగా కలుసుకుని ఈ మహనాడులో పాలుపంచుకొనేలా చేయాలని వారు సూచించారు. పార్టీ అధిష్టానం నుంచి అవసరమైన అన్నిరకాల సహయసహకారాలు వారికి ఉంటాయని తెలియజేశారు. యూరప్‌లో జరిగే వేడుకకు రావాలని ఉన్నా, రాష్ట్రంలో మహానాడును వేడుకలా నిర్వహించబోతున్నందున రాలేకపోతున్నామని తెలియజేశారు. 


‘‘ఇది మనందరిది భాధ్యత.. ఇప్పటివరకు ఒక లెక్క, ఈ 40వ సంవత్సరాల మహానాడు మరో లెక్క. తెలుగు ప్రజలమైన మనందరిపైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందువల్ల అందరూ చిత్తశుద్ధితో, అంకితభావంతో ఎవరి స్థాయిలో వారు, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలి’’ అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నేతలు కోరారు. 


ఈ కార్యక్రమ నిర్వాహకులందరూ అచ్చన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపి, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యనిర్వాహక సమావేశానికి యూకే నుంచి జయకుమార్ గుంటుపల్లి, వేణు మాధవ్ పోపూరి, శ్రీకిరణ్ పరుచూరి, నరేష్ మల్లినేని, ప్రసన్న నాదెండ్ల, శ్రీనివాస్ పాలడుగు, చక్రీ మువ్వ, సురేష్ అట్లూరి, నారాయణ రెడ్డి, శ్రీకాంత్ యర్రం, నాగరాజు బండ్ల, వీర పరిటాల, శ్రీధర్ నారా, కిరణ్ అరవపల్లి, యూకే విద్యార్థి నాయకులు భానూజీ కుక్కల, లింగా రవితేజ, హర్ష చప్పిడి, రవి నల్లమోతు, ఐర్లాండ్ నుంచి మురళీ రాపర్ల, జర్మనీ నుంచి టిట్టు, శివ, పోలెండ్ నుంచి చందు, బెల్జియం నుంచి దినేష్, ఫ్రాన్స్ నుంచి మహేష్ తదితరులు హాజరయ్యారు. హాజరు కాలేని మిగతా సభ్యులు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

Updated Date - 2022-04-25T21:28:33+05:30 IST