టీడీపీలో మహాజోష్‌

ABN , First Publish Date - 2022-05-28T06:43:25+05:30 IST

ఉమ్మడి పశ్చిమగోదావరిలో తెలుగుదేశం తలపెట్టిన మహానాడులో నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.

టీడీపీలో మహాజోష్‌
మహానాడులో చంద్రబాబు అభివాదం

 మహానాడుకు వేలాదిగా తరలివెళ్ళారు   

 ఎక్కడికక్కడ నేతల సమన్వయం, ప్రయాణ ఏర్పాట్లు

 తమ్ముళ్ళల్లో రెట్టించిన ఉత్సాహం  

 మరోవైపు ఎన్టీఆర్‌ శత జయంతికి భారీ ఏర్పాట్లు


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఉమ్మడి పశ్చిమగోదావరిలో తెలుగుదేశం తలపెట్టిన మహానాడులో నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఎవరంతట వారుగా తమ అనుకూలురును వెంటేసుకుని ముందుకు సాగారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు మండలాల వారీగా ముందు సమీక్షలు చేసి కార్యకర్తలు ఒంగోలువైపు ఎలా ప్రయాణించాలో మార్గనిర్దేశం చేశారు. ఏలూరు, దెందులూరు, ఉండి, తణుకు, పాలకొల్లుతో సహా దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు మహానాడులో పాలుపంచుకు నేందుకు తరలివెళ్ళారు. వాస్తవానికి  రెండు నెలలుగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న కార్యక్రమాల్లో బాదుడే బాదుడుకు అత్యధిక ప్రజాదరణ లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈసారి చంద్రబాబు రావాలంటూ కార్యకర్తలు, నేతలను దగ్గరుండి ఆందోళనలను ప్రోత్సహించారు. మహిళలు బహిరంగ మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. టీడీపీకి ఇలాంటి ప్రోత్సాహం గడిచిన మూడేళ్ళల్లో ఎన్నడూ లేనేలేదు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందనడానికి ఈ పోత్సాహమే తార్కాణమని తెలుగుదేశం అంచనా వేస్తుంది. ప్రజా వ్యతిరేక విధానాలు, పన్నుల ఒడ్డన, అభివృద్ధిలో వెనకడుగు, వివిధ వర్గాలపై భౌతిక దాడులు, అక్రమ కేసులు వంటివన్నీ కలబోసి అందరిలోనూ తెలుగుదేశం రావాలనే కాంక్ష పెరిగిందనే అభిప్రాయాన్ని పార్టీనేతలే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పట్టణ ప్రాంతాలైన ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, నూజివీడుతో సహా అర్బన్‌ ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో మహానాడుకు తరలివెళ్ళడం ఈసారి మరో విశేషం. ఉమ్మడి పశ్చిమలో కేవలం పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల నుంచే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు మహా నాడుకు తరలివెళ్ళారు. వీటితోపాటు అత్యంత కీలక నియోజకవర్గాల్లోను ఇలాంటి స్పందనే భారీగా కనిపించింది. పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ రెండు రోజులు ముందుగానే మహానాడుకు తరలివెళ్ళినా ఆచంట నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలు ఒకరికొకరు సమన్వయపర్చుకుని పెద్ద సంఖ్యలో ఒంగోలువైపు తరలివెళ్ళారు. వాస్తవానికి మెట్ట ప్రాంతాలైన పోలవరం, చింతలపూడి, నూజివీడు వంటి నియోజకవర్గాల్లోనూ ఈసారి అంచనాలకు మించి కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించారు. 

నేతల్లోనూ ఉత్సాహం 

మహానాడుకు ఒకవైపు అధికార పార్టీ ఆటంకాలు సృష్టిస్తున్నా పార్టీ ఇన్‌చార్జీలు ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. రెట్టించిన ధైర్యంతో ఏర్పాట్లు చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఏలూరు పార్టీ ఇన్‌చార్జి బడేటి చంటి వారంతా తమ పార్టీ కేడర్‌కు ముందుగానే ఒక ప్రాంతాన్ని నిర్దేశించి అక్కడి నుంచే అందరూ ఒక్కసారిగా తరలివెళ్ళేలా ఉపాహారంతోపాటు మిగతా సదుపాయాలను కల్పించారు. వాహనాల్లో వెళ్ళే వారు సమాచారం పరస్పరం చేరవేసుకోవాలని, ప్రమాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేశారు. తణుకులో పార్టీ ఇన్‌చార్జి ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీ, పోలవరంలో బొరగం శ్రీనివాస్‌, చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ, నూజివీడులో పార్టీ ఇన్‌చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు, కైకలూరులో ఘంటశాల వెంకటరమణ, మరోవైపు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, సీతామహాలక్ష్మి ఎక్కడికక్కడ పరస్పరం కేడర్‌ను సమన్వయపరిచారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాగంటి బాబు సైతం మహానాడుకు తరలివెళ్ళిన వారిలో ఉన్నారు. నరసాపురం ఇన్‌చార్జి రామరాజు సైతం పార్టీ కేడర్‌తో సహా మహానాడుకు భారీగా తరలివెళ్ళారు. పార్టీలో మహానాడుకు వెళ్ళలేనివారంతా జిల్లాలోనే ఎన్టీఆర్‌ శత జయంతిని శనివారం ఘనంగా చేసేందుకు వీలుగా ఏర్పాట్లలో మునిగితేలారు. 



Updated Date - 2022-05-28T06:43:25+05:30 IST