పేదల వైద్యానికి ‘సంజీవని ఆరోగ్య రథం’

ABN , First Publish Date - 2022-08-10T06:05:04+05:30 IST

‘అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికీ శుభమస్తు’ అనే నినాదంతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ మరో బృహత్తర ప్రజోపయోగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పేదల వైద్యానికి ‘సంజీవని ఆరోగ్య రథం’
నారా లోకేశ్‌ ఆలోచనతో రూపుదాల్చిన సంజీవని ఆరోగ్య రథం

లోకేశ్‌ ఆలోచనతో రూపుదిద్దుకున్న సంచార వాహనం

డాక్టర్‌, ఫార్మసిస్ట్‌, సిబ్బందితో నిరంతర వైద్య సేవలు

200లకు పైగా రోగ నిర్ధారణ పరీక్షలు... ఉచితంగా మందులు

నేడు దుగ్గిరాలలో ప్రారంభించనున్న నారా లోకేశ్‌

మంగళగిరి, ఆగస్టు 9: ‘అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికీ శుభమస్తు’ అనే నినాదంతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ మరో బృహత్తర ప్రజోపయోగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్‌గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన లోకేశ్‌, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలోనూ అదే రీతిగా స్పందిస్తున్నారు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించారు. చిన్న చిన్న జబ్బులకు సైతం ఆసుపత్రుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వెచ్చించలేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి మెరుగైన తక్షణ వైద్యం అందించేందుకు తన మదిలో మెదిలిన ఆలోచనకు లోకేశ్‌ కార్యరూపం దాల్చారు. నియోజకవర్గంలో గ్రామీణుల కోసం మొదటిసారిగా సంజీవని ఆరోగ్య రథం పేరుతో మొబైల్‌ ఆసుపత్రిని సిద్ధం చేశారు. సంజీవని ఆరోగ్య రథంలో అత్యాధునిక వైద్య పరికరాలు, పరీక్షా యంత్రాలు, ఎమర్టెన్సీకి అవసరమైన వైద్య సామాగ్రి అందుబాటులో వుంటాయి. ఒక జనరల్‌ ఫిజీషియన్‌ అయిన డాక్టరు, క్వాలిఫైడ్‌ ఫార్మసిస్ట్‌, మహిళా నర్సు, కాంపౌండర్‌ ఉంటారు. ఈ ఆరోగ్య రథం ద్వారా రెండొందలకు పైగా రోగ నిర్ధారణ పరీక్షలు పూర్తి ఉచితంగా చేస్తారు. అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగానే అందిస్తారు. ఈ ఆరోగ్య రథం ఏ రోజు ఏ ఊరును సందర్శిస్తుందో ముందుగా షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. తరచు మాతా శిశు సంరక్షణ సూచనలు ఇవ్వడంతోపాటు ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. సంజీవని ఆరోగ్య రథాన్ని తొలిగా బుధవారం సాయంత్రం దుగ్గిరాల మండలంలో నారా లోకేశ్‌ ప్రారంభిస్తారు. త్వరలో మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలకు కూడా సంజీవని సంచార ఆరోగ్య రథాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-10T06:05:04+05:30 IST