గ్రామ, వార్డు స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ధ్వజం
రాజుపాళెం: గత ఎన్నికల్లో ప్రజలకు అబద్దాలు చెప్పి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి జి.వి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం వెల్లాలలోని శ్రీ లక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో గ్రామ, వార్డు స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రబీలో రైతులు వర్షాల కారణంగా పంట నష్టపోతే కోటి రూపాయలు తన సొంత నిధులు ఇస్తామని చెప్పి ఎమ్మెత్యే రైతులను మోసం చేయడం అబద్ధం కాదా అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి అవసరం లేదని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పడం అపబ్ధం కాదా? అని ప్రశ్నించారు. ఎమ్యెల్యే, ఆయన బావమర్ధి ఇసుక, మట్కా వ్యాపారం ద్వారా అక్రమ సంపాదన చేస్తున్నారని, అక్రమ సంపాదన లేదని వెల్లాల సంజీవరాయస్వామి వద్ద ప్రమాణం చేయాలని సవాల్ విసురుతున్నట్లు ప్రవీణ్ పేర్కొన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని తమకు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ పరిశీలకుడు మురళీధర్, మాజీ పట్టణాధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి, మాజీమున్సిపల్ ఛైర్మన్ ముక్తియార్, మాజీ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిప్రసన్న, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.