ఆందోళనాపథం

ABN , First Publish Date - 2022-07-03T06:21:17+05:30 IST

ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలతో శనివారం తిరుపతి జిల్లా దద్ధరిల్లిపోయింది.

ఆందోళనాపథం
తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదుట టీడీపీ నాయకుల ధర్నా

-ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీ, వామపక్షాల ధర్నాలు

-వాకాడులో టీడీపీ నేతల అరెస్టు

-కలెక్టరేట్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌ ఆందోళన... స్తంభించిన వాహన రాకపోకలు

-తొట్టంబేడులో సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతుల ధర్నా

-గూడూరు మున్సిపల్‌ ఆఫీసు ముందు బీజేపీ ధర్నా


తిరుపతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలతో శనివారం తిరుపతి జిల్లా దద్ధరిల్లిపోయింది. ఇంచుమించు ప్రతి మండలంలోనూ ఆందోళనలు, నిరసనలు జరిగాయి.ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదుట బైఠాయించాయి. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ తిరుపతి పార్లమెంటు కమిటీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. తిరుపతి రూరల్‌ మండలం చెర్లోపల్లి క్రాస్‌ వద్ద జాతీయ రహదారిపై చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. గూడూరులో ఆర్టీసీ డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. కాగా వాకాడు ఆర్టీసీ డిపో వద్ద టీడీపీ ధర్నాలో వాకాడు, చిట్టమూరు, కోట మండలాల శ్రేణులు మొహరించాయి. దీంతో పోలీసులు అడ్డుకుని ముఖ్య నాయకులను అరెస్టు చేశారు. సూళ్ళూరుపేట, నాయుడుపేట, పుత్తూరు, శ్రీకాళహస్తి, వడమాలపేట, నాగలాపురం తదితర చోట్ల టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాయి. ఇక తడలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఓజిలి, రేణిగుంట, చిన్నగొట్టిగల్లు, పాకాల, రామచంద్రాపురం, తొట్టంబేడు తదితర చోట్ల కూడా టీడీపీ శ్రేణులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జరిపాయి. బీఎన్‌ కండ్రిగలో టీడీపీ, సీపీఐ, సీపీఎం శ్రేణులు సంయుక్తంగా రాస్తారోకోకు దిగగా కేవీబీపురంలో టీడీపీ, సీపీఎం శ్రేణులు ధర్నా చేపట్టాయి. తిరుపతి ఆర్టీసీ బస్టాండులో గ్యారేజీ వద్ద సీపీఐ, సీపీఎం శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. సీపీఎం నేతలు  హరినాధరెడ్డి, మురళి, పెంచలయ్య, రాధాకృష్ణ, సీపీఎం నేతలు నాగరాజు, లక్ష్మి, జయచంద్ర, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీకాళహస్తిలో ప్రజాసంఘాలు ధర్నా జరిపాయి.


వేర్వేరు కారణాలతో ...

వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చవద్దంటూ తొట్టంబేడు మండలంలో సబ్‌ స్టేషన్‌ వద్ద ప్రజా సంఘాలు, రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. అలాగే గూడూరులో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ శ్రేణులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్‌ శ్రేణులు తిరుపతిలో కలెక్టరేట్‌ ఎదుట రాస్తారోకో చేపట్టాయి. దీంతో గాజులమండ్యం నుంచి తిరుచానూరు ప్లైఓవర్‌ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల దూరం ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు, ప్రయాణికులు కలసి ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగారు.  కలెక్టర్‌ కార్యాలయం వద్దకు పోలీసులు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయించాయి. ఓజిలి మండల కేంద్రంలోనూ ఎమ్మార్పీఎస్‌ శ్రేణులు రాస్తారోకో చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - 2022-07-03T06:21:17+05:30 IST