దారి చెరువై..!

ABN , First Publish Date - 2021-07-25T05:56:41+05:30 IST

ఆర్‌ అండ్‌ బీ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

దారి చెరువై..!
వీరులపాడులో చెరువును తలపిస్తున్న ఆర్‌ అండ్‌ బీ రహదారిని పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు

చెరువులను తలపిస్తున్న దారులపై టీడీపీ నాయకుల నిరసనలు

తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్‌

వీరులపాడులో టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తల జులుం

నిరసన వ్యక్తం చేస్తున్న నేతలపై పేడ నీళ్లు

అడ్డుకోవాల్సిన పోలీసుల ప్రేక్షకపాత్ర

టీడీపీ నేతలనే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలింపు

కృష్ణాలో కడప ఫ్యాక్షన్‌ విధానం.. 

మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం


ఆర్‌ అండ్‌ బీ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఆ దారుల్లో ప్రయాణించే ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రజల పక్షాన గళమెత్తిన విపక్ష టీడీపీ నేతలపై అధికార వైసీపీ కార్యకర్తలు పేడ నీళ్లు చల్లారు. వారిపై దాడికి ప్రయత్నించారు. శనివారం వీరులపాడులో చోటుచేసుకున్న ఈ ఘటనలో దాడికి పాల్పడిన వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు టీడీపీ నేతలనే అరెస్టు చేయడం విమర్శలకు తావిచ్చింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/వీరులపాడు) : అధ్వానంగా మారిన రహదారులకు తక్షణమే మరమ్మతులు చేయాలంటూ వీరులపాడు మండలంలో టీడీపీ నాయకులు నిర్వహించిన ఆందోళన వైసీపీ మూకల ఆగడాలతో ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు పేడ నీళ్లు చల్లారు. వారిని నిలువరించాల్సిన పోలీసులు టీడీపీ నాయకులనే అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. జిల్లాలోని వీరులపాడు మండలంలో జుజ్జూరు ఆర్‌ అండ్‌ బీ రహదారి మోకాలులోతు గోతులతో అధ్వానంగా మారింది. దీనికి మరమ్మతులు  చేయాలని రెండేళ్ల కాలంలో టీడీపీ నాయకులు రెండుసార్లు నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో శనివారం జుజ్జూరు రహదారి వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ తదితరులు ఆందోళనకు దిగారు. అదే  సమయంలో అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు వారిపై పేడ నీళ్లు చల్లారు. దాడి చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వైసీపీ కార్యకర్తలను నిలువరించకుండా ప్రేక్షక పాత్ర వహించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగిన తర్వాత పోలీసులు టీడీపీ నాయకులను  అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వైసీపీ కార్యకర్తలు, పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు వచ్చిన నాయకులపై వైసీపీ కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం సరైంది కాదన్నారు. పోలీసులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


టీడీపీ నేతల అరెస్టు

నిరసనలో పాల్గొన్న టీడీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి కంచికచర్ల, నందిగామ, వీరులపాడు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దేవినేని ఉమ, నెట్టెం రఘురామ్‌, గద్దె రామ్మోహన్‌, తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య తదితర నాయకులను చందర్లపాడు స్టేషన్‌కు తరలించి, అనంతరం విడుదల చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఆయా స్టేషన్లలో తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేసే వరకు తాము వెళ్లేది లేదంటూ చందర్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాయకులు  భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఆయా స్టేషన్లలో అరెస్టు అయిన వారిని సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షుడు దాములూరి మధుసూదనరావు, దగ్గుల కేశవరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస కుమార్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కోగంటి బాబు తదితరులు పాల్గొన్నారు.  


ప్రజలే బుద్ధి చెబుతారు : దేవినేని ఉమ


ప్రశాంతతకు మారుపేరైన కృష్ణాజిల్లాలో పులివెందుల ఫ్యాక్షనిజాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పి తీరుతారని మాజీ మంత్రి  దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో గ్రామాలలో రోడ్ల దుస్థితిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 25 వేల కిలోమీటర్ల మేర సిమెంట్‌ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. రోడ్ల దుస్థితిని పరిశీలిస్తున్న తమపై వైసీపీ నాయకులు దాడులు చేయడం దారుణమన్నారు.   


ప్రశ్నిస్తే అరెస్టులా : రఘురామ్‌

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేయటం దారుణమని మాజీ మంత్రి, టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితిని పరిశీలించాలంటూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాము ఇక్కడకు వస్తే అరెస్టులు చేయటం ఏమిటన్నారు. ప్రశ్నిస్తున్న వారిని అణచివేయాలనుకోవటం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్యలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన ప్రశ్నించేందుకే ప్రతిపక్షాలు ఉన్నాయని, వారిని ప్రశ్నించకుండా అడ్డుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. 


జిల్లావ్యాప్తంగా నిరసనలు..

కైకలూరు నియోజకవర్గంలోనూ అధ్వాన రహదారులపై టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. కైకలూరు మండలం వరాహపట్నం నుంచి ఉప్పుటేరు వెళ్లే ప్రధాన రహదారిని మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ పరిశీలించారు. రోడ్లపై గుంతల్లో చేరిన నీరు చెరువును తలపిస్తుండటంతో వాటిలో చేపలను వదిలిన రమణ, రహదారులకు తక్షణమే మరమ్మతులు  చేయాలని డిమాండ్‌ చేశారు. పామర్రు నియోజకవర్గంలో ఉయ్యూరు- కాటూరు రోడ్డులో గోతులను పూడ్చాలంటూ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ నిరసన వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గంలోనూ టీడీపీ నాయకులు నిరసనలు తెలిపారు.



Updated Date - 2021-07-25T05:56:41+05:30 IST