‘‘పెంచిన ధరలను తగ్గించకపోతే.. అదే జరుగుతుంది’’

ABN , First Publish Date - 2021-08-28T23:54:44+05:30 IST

పశ్చిమగోదావరి: పెంచిన డీజిల్, పెట్రోల్ గ్యాస్ రేట్లను వెంటనే తగ్గించాలని.. లేదంటే సంఘటిత పోరాటం చేసి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు హెచ్చరించారు.

‘‘పెంచిన ధరలను తగ్గించకపోతే.. అదే జరుగుతుంది’’

పశ్చిమగోదావరి: పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని.. లేదంటే సంఘటిత పోరాటం చేసి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు హెచ్చరించారు. పెరిగిన ధరలకు నిరసనగా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ నేతలు.. జంగారెడ్డిగూడెంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం బస్టాండ్ నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా చంద్ర శేషు మాట్లాడుతూ దేశంలోనే ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం.. ఏపీనే అని చెప్పారు. అధిక పన్నులు వేస్తూ.. పేదవాడి నడ్డి విరుస్తున్నారన్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పెట్రో, డీజిల్ ధరలు పెరగడంతో.. మిగతా వస్తువల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ధరలను తగ్గిస్తామని.. జగన్ మాయ మాటలు చెప్పారని చంద్ర శేషు విమర్శించారు. 


టీడీపీ కామవరపుకోట, లింగపాలెం అధ్యక్షులు కిలారు సత్యనారాయణ, గరిమెళ్ళ చలపతిరావు మాట్లాడుతూ పెట్రోల్ రూ.108, డీజిల్ 100తో రాష్ట్రం టాప్‌లో ఉందన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం జగన్.. వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవి మాట్లాడుతూ అమెరికాలో కూడా రెండున్నర లీటర్ల ధర కేవలం రూ.45 ఉంటే.. ఆంధ్రాలో మాత్రం రూ.108 ఉందన్నారు. అలాగే వంట గ్యాస్ రూ.600 నుంచి రూ.1,000 వరకూ వెళ్తోందని చెప్పారు. ధరలు ఇలా ఉంటే సామాన్యులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. వెంటనే ధరలు తగ్గించకపోతే మహిళలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో ఆఫీసులో వినతిపత్రం అందించారు. 


కార్యక్రమంలో టీడీపీ నేతలు బొబ్బర రాజపాల్, గంటా సుధీర్ బాబు, ఆకుమర్తి రామారావు, ముళ్ళపూడి శ్రీను, కొయ్యగుర వెంకటేష్, గంటా మాధవరావు, నంగులూరి జగత్ కుమార్, ఎలికే ప్రసాద్, చదలవాడ నాగు, గొల్లమండల శ్రీనివాస్, పారేపల్లి నరసింహారావు, పల్లి శ్రీను, పొల్నాటి సత్యనారాయణ, నత్త నాగు, నవీన్, బొలుసు సాయి మెరుగు సుందరరావు పాతురి మురళి, సూరం సుధీర్, గంధం గోపాలకృష్ణ, గంటా రామారావు, తడికల మోహన్, బొల్లిన పుల్లారావు, రాగాని శ్రీను, బొడా శ్రీను తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-28T23:54:44+05:30 IST