ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతులకు డబ్బులు ఇవ్వరే?

ABN , First Publish Date - 2021-06-22T06:29:08+05:30 IST

ప్రభుత్వం రెండు నెలలుగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు డబ్బు ఇవ్వలేదని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతులకు డబ్బులు ఇవ్వరే?
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు, డాక్టర్‌ అరవిందబాబు తదితరులు

టీడీపీ నేత జీవీ ఆంజనేయులు

నరసరావుపేట టౌన్‌, జూన్‌ 21: ప్రభుత్వం రెండు నెలలుగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు డబ్బు ఇవ్వలేదని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండునెలలుగా రైతులు బాధపడుతుంటే పౌరసరఫరాలమంత్రి కొడాలి నాని ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మాట్లాడితే లోకేశ్‌ను తిడతారని,  రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని లోకేశ్‌ అంటే తప్పేంటన్నారు. జగన్‌రెడ్డి అవినీతి గురించి మాట్లాడితే వెంటనే కొంతమంది కుక్కలు మొరిగినట్లు మొరుగుతున్నారన్నారు. మంత్రి కొడాలి నాని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మాటలు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. వైసీపీ నాయకులు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని, మీకు దమ్ముంటే రైతులకు ముందు డబ్బులు ఇచ్చి మాట్లాడాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రెండురోజుల్లో డబ్బులు ఇప్పించామని చెప్పారు. చాలామంది రైతులకు గిట్టుబాటు ధర లేదని, 40లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. రూ.3600 కోట్లు రైతులకు బకాయిలు ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన రూ.200కోట్టు ఏవిధంగా సరిపోతాయని, మంత్రి కొడాలి నాని  సమాధానం చెప్పాలన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర లేదని, ఇంకా 40లక్షల టన్నుల ధాన్యం కొనాల్సివుందన్నారు. కరోనా వల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడ్డారని, చాలామంది చనిపోయారని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని చెప్పారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మొండితోక రామారావు, గొట్టిపాటి జనార్ధనబాబు, చల్లా సుబ్బారావు, రాపర్ల జగ్గారావు, షేక్‌ మహ్మద్‌ రఫీ, కూరపాటి హనుమంతురావు, గూడూరు శేఖర్‌, గడ్డం కరీముల్లా, షేక్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:29:08+05:30 IST