జగన్‌ పాలనలో జనంపై పన్నుల బాదుడు

ABN , First Publish Date - 2020-12-05T05:39:37+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో ప్రజలపై పన్నులు విధించడం తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి ధ్వజమెత్తారు.

జగన్‌ పాలనలో జనంపై పన్నుల బాదుడు
సమావేశంలో మాట్లాడుతున్న లింగారెడ్డి

పన్నుల పెంపు వ్యతిరేకిస్తూ నేడు నిరాహారదీక్షలు

టీడీపీ కడప పార ్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి


కడప, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో ప్రజలపై పన్నులు విధించడం తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం కడపలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ పాలనలో విద్యుత్‌, కరెంటు, పెట్రో ఛార్జీలు ఎన్నడూ లేని విధంగా విపరీతంగా పెంచారన్నారు. ఆటో వాళ్లకు రూ.10 వేలు ఇస్తూ ఫైన్‌ రూపంలో రూ.50 వేల నుంచి లక్ష వసూలు చేస్తున్నారని విమర్శించారు. కొందరు ఆటో కార్మికులు జగన్‌ సర్కారు విధించిన అపరాధ రుసుం చెల్లించలేక ఆటోలను అమ్ముకున్నారన్నారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌, నగర పంచాయతీలో భవన, అద్దె విలువ ఆధారంగా పన్నులు వసూలు చేశారన్నారు. అయితే జగన్‌ సర్కారు నివాస గృహాలకు 0.1 నుంచి 0.5 వరకు, నివాసేతర ప్రాంతాలకు 0.2 నుంచి 2 శాతం వరకు పెంచే విధంగా చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఆదాయం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రిజిస్ట్రేషన్‌ విలువ పెంచుతోందన్నారు. కొత్త పన్నుల విధానం అమల్లోకి తెస్తే ప్రతి ఏటా ఆస్తి పన్ను విలువ పెరుగుతుందన్నారు. చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం టీడీపీ ఆధ్వర్యంలో దీక్షలు చేపడుతున్నట్లు వివరించారు. చంద్రబాబుపై రాజకీయ కక్షతో హెరిటేజ్‌, చిన్న చిన్న ప్యారడైజ్‌లను దెబ్బతీసేందుకు ఏడాదికి 500 కోట్లు వడ్డీ కట్టి, 3 వేల కోట్లు అప్పు తెచ్చి అమూల్‌ సంస్థకు మౌలిక వసతులు కల్పిస్తున్నదని ఆరోపించారు. జగన్‌ నిర్ణయం వల్ల చిన్న చిన్న డెయిరీలు దెబ్బతింటున్నాయన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, హరిప్రసాద్‌ మాట్లాడుతూ పాలన మొత్తం అవినీతిగా మారింది. ఈ విషయం అసెంబ్లీలో ప్రశ్నిస్తే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నారన్నారు. మంత్రులు  పేర్నినాని, కొడాలినాని సిగ్గు లేకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరోనా కారణంగా ప్రజాజీవితాలు తలకిందులయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో పన్ను రద్దు చేయాల్సింది పోయి పెంచడం దారుణమన్నారు. పన్నుల పెంపును ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, కడప టీడీపీ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు, టీడీపీ నాయకులు పీరయ్య, వికా్‌సహరి, జిలానీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T05:39:37+05:30 IST