చంద్రబాబు ఇంటి ముట్టడి హేయమైన చర్య

ABN , First Publish Date - 2021-09-18T03:48:30+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటి దగ్గర వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తన అనుచర గణంతో బీభత్సం సృష్టించి ముట్టడికి ప్రయత్నించడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఇంటి ముట్టడి హేయమైన చర్య
కావలిలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

మాజీ ఎమ్మెల్యే బొల్లినేని

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 17: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటి దగ్గర వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తన అనుచర గణంతో బీభత్సం సృష్టించి ముట్టడికి ప్రయత్నించడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసి జెడ్‌ కేటగిరీ ఉన్న వ్యక్తికే భద్రత కరువైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని రమేష్‌ ముందే హెచ్చరించినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే రమేష్‌ ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. ప్రతిపక్ష నాయకుడ్ని రాష్ట్రంలో తిరగనివ్వబోమని హెచ్చరించడం అతని అహంకారానికి నిదర్శనమన్నారు. వెంటనే అతని శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు, కేసులు నమోదు చేయడం సర్వసాధారణమైందన్నారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గట్టిగా బుద్ధి చెపుతారని ఆయన హితవు పలికారు. 

కావలి : మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి ముఖ్యమంత్రి, డీజీపీ, హోం మంత్రి బాధ్యత వహించాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కావలి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర, మాజీ ఏఎంసీ చైర్మన్‌ మలిశెట్టి వెంకటేశ్వర్లు, పార్లమెంట్‌ జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు కాకి ప్రసాద్‌, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యేగూరు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ అందుకు బాద్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్‌ రెడ్డి సలహా, పోలీసుల అండదండలతోనే జోగి రమేష్‌ తన గూండాలతో చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లారని చెప్పారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న డీజీపీ తీరు చూస్తుంటే ఆయన ఆ డ్రస్‌ తీసేసీ వైసీపీ చొక్కా వేసుకుని తిరిగితే సరిపోయేట్లుగా ఉందన్నారు. ఈ దాడికి పోలీసుల వైఫల్యమే కారణమన్నారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, నేతలు గుత్తికొండ కిషోర్‌, దేవకుమార్‌, తటవర్తి వాసు, ఆత్మకూరి నాగరాజు, పల్లపు కుమార్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T03:48:30+05:30 IST