సూత్రధారులు వీరేనా?

ABN , First Publish Date - 2021-10-20T08:39:32+05:30 IST

: అలా వచ్చారు! ఇలా దాడి చేశారు! ఆ తర్వాత ఎంచక్కా.. అవే వాహనాల్లో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లిపోయారు! తమ పార్టీ కార్యాలయంపైనా, పార్టీ నేత పట్టాభి ఇంటిపైనా దాడి చేసింది వైసీపీ నేతలే అనేందుకు ఇదే నిదర్శనమని

సూత్రధారులు వీరేనా?

  • అప్పిరెడ్డి, అవినాశ్‌, నందిగం సురేశ్‌పై టీడీపీ అనుమానం
  • దాడి అనంతరం వైసీపీ ఆఫీసు వద్ద అవే వాహనాలు
  • అందులో... అప్పిరెడ్డి అనుచరుడి ఫార్చ్యూనర్‌


విజయవాడ/గుంటూరు/అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): అలా వచ్చారు! ఇలా దాడి చేశారు! ఆ తర్వాత ఎంచక్కా.. అవే వాహనాల్లో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లిపోయారు! తమ పార్టీ కార్యాలయంపైనా, పార్టీ నేత పట్టాభి ఇంటిపైనా దాడి చేసింది వైసీపీ నేతలే అనేందుకు ఇదే నిదర్శనమని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇటీవల గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేశ్‌, ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిన విజయవాడకు చెందిన యువ నాయకుడు దేవినేని అవినాశ్‌... ఈ ముగ్గురే దాడి సూత్రధారులని ఆరోపిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దుండగులు వాడిన వాహనాల్లో ఒకటి.. ఏపీ07బీఈ2345 నల్లరంగు ఫార్చ్యూనర్‌! ఇది ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడిగా భావిస్తున్న బ్రహ్మానందరెడ్డి పేరిట రిజిస్టర్‌ అయి ఉంది. దీనిపై ‘ఏఆర్‌’ (అప్పిరెడ్డి) అనే స్టిక్కర్‌ కూడా ఉంది. దీనిని అప్పి రెడ్డి కూడా ఉపయోగిస్తారని సమాచారం. దాడి అనంతరం ఈ కారుతోపాటు మరికొన్ని కార్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు కనిపించాయి. 


అంతా పథకం ప్రకారం... 

మంగళగిరిలో డీజీపీ కార్యాలయానికీ, టీడీపీ కార్యాలయానికీ మధ్య సీకే కన్వెన్షన్‌ హాలు ఉంది. దాడికి ఇక్కడి నుంచే ప్రణాళిక రచించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అప్పిరెడ్డి, అవినాశ్‌ అనుచరగణం మంగళవారం మధ్యాహ్నం ఇక్కడ సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ‘ప్లాన్‌’ సిద్ధమైన తర్వాత..  కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల్లో దాడులకు బయలుదేరారు. ముందుగా విజయవాడలోని పట్టాభి ఇంటిపై దాడికి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బయలుదేరారు. సాయంత్రం 4.10 గంటల సమయంలో పట్టాభి ఇంటిపై దాడిచేశారు. ఈ దాడిలో అప్పిరెడ్డి మనుషులతోపాటు అవినాశ్‌ అనుచరులు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 5-10 నిమిషాల వ్యవధిలో మొత్తం విధ్వంసాన్ని పూర్తి చేసి పట్టాభి ఇంటి నుంచి నేరుగా టీడీపీ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ మరోసారి కన్వెన్షన్‌ సెంటరు వద్ద ఆగి... అంతా సిద్ధం అనుకున్న తర్వాత టీడీపీ ఆఫీసుపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ముగ్గురు వైసీపీ నేతలు కార్లలో కూర్చుని... దాడిని పర్యవేక్షించారని కూడా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.




పట్టాభి ఇంటిపైనా, టీడీపీ ఆఫీసుపైనా దాడికి వచ్చినవారు ‘పక్కా ప్రొఫెషనల్స్‌’లా వ్యవహరించారు. కర్రలు, సుత్తులు, రాడ్లు తెచ్చుకుని కొద్ది సమయంలోనే విధ్వంసం సృష్టించారు. పెద్ద రాళ్లు తీసుకువచ్చి అద్దాలపైకి విసిరారు. అడ్డొచ్చిన వారినీ గాయపరిచారు. ఏమాత్రం బెరుకు, భయం లేకుండా చకచకా పని పూర్తిచేసుకుని వెళ్లిపోయారు. నేర నేపథ్యం ఉన్న వ్యక్తులే ఇలా విధ్వంసం సృష్టించగలరని టీడీపీ వర్గా లు భావిస్తున్నాయి. దాడికి మహిళల్ని తీసుకురావడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు అనుమానిస్తున్నాయి.

Updated Date - 2021-10-20T08:39:32+05:30 IST