Abn logo
Jul 30 2021 @ 23:55PM

సమస్యలపై పోరాడుదాం

మాట్లాడుతున్న కూన రవికుమార్‌, పక్కన ఎమ్మెల్యే అశోక్‌

- సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతల తీర్మానం

- తితలీ బాధితులకు, వంశధార నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూలై 30: తితలీ తుఫాన్‌ బాధితులకు, వంశధార నిర్వాసితులకు న్యాయం చేసేలా ప్రత్యక్ష కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్‌ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ సమస్యలపై పార్టీపరంగా ఆందోళనలు, ధర్నాలు చేసి.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. తితలీ తుపానులో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం మంజూరయ్యేలా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో ధర్నా చేయాలని నిర్ణయించారు. వంశధార నిర్వాసితుల తరపున ఆర్డీవోను కలసి వినతిపత్రాలు సమర్పించేందుకు కార్యాచరణ రూపొందించారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు విపరీతంగా  పెంచడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈమేరకు నరసన్నపేట నియోజకవర్గంలో ఆగస్టు 3న ధర్నా చేసేందుకు తీర్మానం చేశారు. ఇంటిపన్ను, చెత్తపై పన్నులపై అదేరోజున అన్ని మునిసిపాల్టీల కమిషనర్లకు వినతిపత్రం ఇచ్చేందుకు పార్టీపరంగా ఆమోదించారు. రైతులకు ఎరువులు, పురుగుమందుల సరఫరా విషయంలో ఆన్‌లైన్‌ చెల్లింపుల విధానాన్ని రద్దు చేయాలని, అగ్రిగోల్డ్‌ బాధితులకు సకాలంలో పరిహారం చెల్లించాలని తీర్మానించారు. 


  విద్యాదీవెన కాదు.. విద్యార్థులకు దగా

- టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రవికుమార్‌

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది విద్యాదీవెన పథకం కాదని.. విద్యార్థుల దగా పథకం అని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు.  శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 16లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మంజూరు చేస్తే... జగన్‌రెడ్డి ప్రభుత్వం దాన్ని 10.97 లక్షల మందికి కుదించిందన్నారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ను దూరం చేసి వారి భవిష్యత్‌ను నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యకు సంబంధించి నీతి అయోగ్‌ ప్రకటించిన ర్యాంకులో రాష్ట్రం 19వ స్థానానికి దిగజారిందన్నారు. దీనికి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యాదీవెన ను నిలిపివేస్తూ జీవో నంబర్‌ 77ను విడుదల చేయడం దారుణమన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాల కొనుగోళ్లను టీడీపీ ప్రభుత్వం గతంలో లేపాక్షికి అప్పగిస్తే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడి పూనెకు చెందిన ప్రైవేట్‌ సంస్థకు ఇచ్చిందని విమర్శించారు. కొవిడ్‌ సమయంలో 600 మంది ఉపాధ్యాయులు చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం.. విద్యావ్యవస్థను ఎలా పటిష్ట పరుస్తుందని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకంలో సామాజిక న్యాయాన్ని తలకిందులు చేసి వాటిని వైసీపీ కార్యాలయాలుగా మార్పుచేశారని ఆయన దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బోయిన గోవిందరాజులు, కలమట సాగర్‌, పార్లమెంట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌, ఉపాధ్యక్షులు జోతనపల్లి సాంబమూర్తి, ఐటీడీపీ అధ్యక్షులు పి.విజయరాం, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.