రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే బాధ్యత టీడీపీ భుజస్కంధాలపైనే!

ABN , First Publish Date - 2021-04-13T05:45:52+05:30 IST

రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే బాధ్యత తెలుగుదేశం పార్టీ భుజస్కందాలపై ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే బాధ్యత  టీడీపీ భుజస్కంధాలపైనే!
టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు

పనబాక లక్ష్మిని గెలిపించండి

 టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు 


వెంకటగిరి, ఏప్రిల్‌ 12 : రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే బాధ్యత తెలుగుదేశం పార్టీ భుజస్కందాలపై ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం వెంకటగిరిలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనన్న భయంతోనే కరోనా సాకు చూపి ముఖ్యమంత్రి జగన్‌ తిరుపతి పర్యటనను రద్దు చేసుకొన్నారని ఆరోపించారు. సుదీర్ఘ తన రాజకీయ ప్రస్థానాన్ని ఎవరూ బ్రేక్‌ చేయలేరని, చరిత్రలో నిలిచి పోతుందని గర్వంగా చెప్పారు. జగన్‌ ప్రభుత్వ తీరుతో తప్పుడు కేసులతో ఇబ్బందిపడ్డ ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ తన బాబాయిని ఎవరు చంపారో చెప్పలేని అసమర్ధుడని, ఇలాంటి సీఎంను తన రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2వేలకు పెంచితే ఇప్పటి జగన్‌ రూ.250 మాత్రమే పెంచి అంతా తానే ఇచ్చినట్లు కరపత్రాల్లో వేసుకొన్నారంటే అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా!? అని నిలదీశారు. తాను పాల్గొన్న రాపూరు కార్యక్రమం విజయవంతమైనట్టు సంతోషం వ్యక్తం చేశారు.  తిరుపతి ఉప ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి విజయం కోసం కరోనా, ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఓటు విషయంలో వైసీపీ ప్రజల్లో పుట్టించిన భయాన్ని పోగొట్టేందుకు ప్రతి కార్యకర్తా ఇల్లిల్లూ తిరిగి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నేతలు అనగాని సత్య ప్రసాద్‌, అబ్దుల్‌ అజీజ్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్‌, వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని మండలాల ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.


ఓట్లపై బూత్‌లవారీగా సమీక్షిస్తా 

నియోజకవర్గ పరిధిలోని 265 పోలింగ్‌ కేంద్రాల్లో మెజారిటీ తీసుకు వచ్చేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలింగ్‌ తరువాత బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు వచ్చాయో తప్పనిసరిగా చూస్తానన్నారు. నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసి 10 క్లష్టర్ల ఇన్‌చార్జులతో బూత్‌ కన్వీనర్లతో సమీక్షించి ఇప్పటి వరకు ఏవిధంగా పనిచేశారు. ఇకపై ఎలా వ్యవహరించాలో సూచనలు చేశారు. ఈ సంద్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మాస్కులు వేసుకొని ఫొటోలు తీయించుకోవడం కొత్త అనుభూతి అని వ్యాఖ్యానించారు.  



Updated Date - 2021-04-13T05:45:52+05:30 IST