పట్టాల పేరుతో మోసం: బీసీ

ABN , First Publish Date - 2022-08-15T05:51:41+05:30 IST

తప్పుడు పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేసింది ఎవరో ప్రజలకు తెలుసునని బనగాపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

పట్టాల పేరుతో మోసం: బీసీ
పోలూరు రాఘవరెడ్డిని పరామర్శిస్తున్న బీసీ జనార్దన్‌రెడ్డి, సుబ్బారెడ్డి

బనగానపల్లె, ఆగస్టు 14: తప్పుడు పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేసింది ఎవరో ప్రజలకు తెలుసునని బనగాపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బనగానపల్లెలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీ మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలో గతంలో కాటసాని రామిరెడ్డి  భానుముక్కలలోని 246 సర్వే నంబరులోని వేంకటేశ్వరస్వామి మాన్యం భూములు, ఎస్సార్బీసీ స్థలాలను 3386 మందికి ఇంటి పట్టాలు అట్టహాసంగా పంపిణీ చేశారన్నారు. ఆ పట్టాలకు ఎస్సార్బీసీ అధికారుల నుంచి గాని, దేవదాయశాఖ అనుమతులు లేకుండా పేదలకు పట్టాలు ఇచ్చి మోసం చేశారన్నారు. ప్రస్తుతం అదే ఎస్సార్బీసీ భూముల్లో మళ్లీ పేదలకు ఇంటి పట్టాలు ఎమ్మెల్యే ఇస్తున్నారని ఆరోపించారు. తాను అడ్డుకుంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎస్సార్బీసీ లోతట్టు ప్రాంతాల్లో ఇంటి పట్టాలు ఇస్తే ఎస్సార్బీసీ కాల్వ గట్టు తెగిపోతే ప్రజలు ప్రమాదంలో పడతారని, అలాంటి చోట పట్టాలు ఇవ్వడం మంచిది కాదనే ఉద్దేశ్యంతోనే కోర్టుకు వెళ్లామన్నారు. బానుముక్కలలోని ఎస్సార్బీసీ కాలనీలో 26.77 సెంటం్లలో 16.5 ఎకరాలు నిరుపయోగంగా ఉందని, అలాగే మరో 3.5 ఎకరాలు ఎస్సార్బీసీ సంబంధించిన భూమి ఉందని తెలిపారు. అక్కడ ఎందుకు పట్టాలు ఇప్పించలేకపోతున్నావని బీసీ ప్రశ్నించారు. పేదలకు పట్టాల పంపిణీ ముసుగులో ఎస్సార్బీసీ స్థలాల్లో రియల్‌ ఎస్టేట్‌వ్యాపారం చేయిస్తూ సెంటు రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారని ఆరోపించారు. లబ్ధిదారుల పేర్లు ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించారు. జుర్రేరు వాగులో వాకింగ్‌ ట్రాక్‌కు తాను కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నానని ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను కోర్టుకు వెళ్లినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేదంటే కాటసాని రాజకీయ సన్యాసం చేయాలని సవాల్‌ విసిరారు. అలాగే శ్మశాన వాటికకు తాను అడ్డుకుంటున్నట్లు ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వాగుల్లోను, పోరంబోకుల పక్కల శ్మశాన వాటికలు పెట్టరాదని నియమ నిబంధనలు ఉన్నాయన్నారు. మైనార్టీ విభాగం కార్యదర్శి అత్తార్‌ జాహీద్‌ హుస్సేన్‌, బనగానపల్లె పట్టణ ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌, పూలకలాం, సలాం, గౌండాబాబు, లాయర్‌ నాగేంద్రరెడ్డి పాల్గొన్నారు. 


బనగానపల్లె మండలంలోని నందవరం-చెర్వుపల్లె గ్రామాల మధ్య రెండు బైక్‌లు ఢీకొనడంతో మృతి చెందిన పలుకూరు గ్రామానికి చెందిన చాకలి పాములేటి, చాకలి రాముడుల మృతదేహాలకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి నివాళి అర్పించారు. బనగానపల్లె ప్రభుత్వవైద్యశాలలో పోస్టుమార్టం గదికి చేరుకొని నివాళి అర్పించారు. 


బేతంచెర్ల: వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి, టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని పోలూరు రాఘవరెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్ల పాలనలో నిత్యావసర సరుకులు సామాన్యునికి అందని ద్రాక్షగా మారాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, విద్యుత్‌, బస్సు చార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు.  అనంతరం బేతంచెర్ల టీడీపీ నాయకుడు పోలూరు రాఘవరెడ్డి కాలుకు గాయాలై ఆపరేషన్‌ చేయించుకుని అనారోగ్యంతో ఉండటంతో బీసీ జనార్దన్‌ రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డి పరామార్శించారు. నాయకులు పోలూరు వెంకటేశ్వరరెడ్డి, షేక్షావలి చౌదరి, తిరుమలేష్‌ చౌదరి, శ్రీనివాసులు యాదవ్‌, గండికోట రామసుబ్బయ్య, రవీంద్ర నాయక్‌, కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు, రమేష్‌,  రామనాథం, నాగరాజు, కౌన్సిలర్‌ గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T05:51:41+05:30 IST