Abn logo
Mar 2 2021 @ 01:06AM

ఎలా నిర్బంధిస్తారు?

  1. బాధిత కుటుంబ పరామర్శకు వెళ్లడమే తప్పా? 
  2. వైసీపీ వాళ్లకైతే నిబంధనలు అడ్డు రావా?
  3.  పోలీసులపై టీడీపీ జిల్లా నాయకుల ధ్వజం 
  4. చంద్రబాబును అడ్డుకోవడంపై నిరసన


కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 1: రేణిగుంట ఎయిర్‌పోర్టులో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు నిర్బంధించడాన్ని తెలుగుదేశం పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయ ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, గెలిచినా వారిని పక్కనబెట్టి వైసీపీ మద్దతుదారులు గెలిచినట్లు అధికారుల ద్వారా ప్రకటించుకున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరుపతిలో వార్డు అభ్యర్థి హోటల్‌ను కూలగొట్టారని, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన చంద్రబాబును నిర్బంధించడం తగదని అన్నారు. వైసీపీ నాయకులు వేలాది మందితో ఊరేగింపులు, సభలు జరుపుకుంటే అడ్డురాని నిబంధనలు టీడీపీ వారికే అడ్డు వస్తాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు బయటకు వెళ్తే.. జగన్‌కు, ఆయన అనుచరులకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, నంద్యాల నాగేంద్రకుమార్‌, నంద్యాల పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు పార్వతమ్మ, కృష్ణవేణి, జేమ్స్‌, అబ్బాస్‌, హనుమంతరావు చౌదరి, సత్రం రామకృష్ణుడు, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. 


సొంత రాష్ట్రంలో తిరగకూడదా?


  1. టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ ప్రభాకర్‌ 


డోన్‌: సొంత రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబును తిరగకుండా అడ్డుకోవడం అన్యాయమని ఎమ్మెల్సీ, డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రభాకర్‌ మండిపడ్డారు. సోమవారం డోన్‌లో ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తిరుపతి వెళ్లిన చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలోనే పోలీసులు నిర్బంధించడం హేయమన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేసే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. డోన్‌ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి బుగ్గన మెప్పు పొందేందుకు పోలీసు అధికారులు టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంకటనాయునిపల్లె శ్రీరాముల ఆలయంలోని ధ్వజస్తంభాల ధ్వంసం కేసు నిందితులను పట్టుకోకుండా.. తమ పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడితే.. ఊరుకునేదిలేదని హెచ్చరించారు. వైసీపీ అరాచకపాలనపై ప్రజలే తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. 


ప్రజలు తిరగబడతారు


  1. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై ప్రజలు తిరగబడటం ఖాయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. సోమవారం నంద్యాలలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పాలనను పూర్తిగా పక్కనపెట్టి టీడీపీ నాయకులను టార్గెట్‌ చేసి అక్రమ కేసులు పెడుతోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా తన విజన్‌తో ఏపీ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చాటిన చంద్రబాబు నాయుడిని రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. నిర్భంధాలు, వేధింపులు, అక్రమ కేసులతో భయపెట్టాలనుకోవడం అవివేకమన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటం సాగిస్తున్నామన్నారు. త్వరలోనే ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయమని ఫరూక్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement