జగ‌న్‌రెడ్డిది పిరికిపంద చర్య.. తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం

ABN , First Publish Date - 2021-03-01T18:54:58+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుపతిలోని రేణిగుంట ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్న విషయం విదితమే.

జగ‌న్‌రెడ్డిది పిరికిపంద చర్య.. తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం

అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుపతిలోని రేణిగుంట ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్న విషయం విదితమే. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులోనే బాబు బైఠాయించారు. ఈ ఘటనపై తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా, మీడియా వేదికగా స్పందిస్తూ జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ.. కుప్పం పర్యటనలో ప్రజలు పెద ఎత్తున నీరాజనం పలికారన్న విషయాన్ని గుర్తు చేశారు. చిత్తూరు, తిరుపతి పర్యటనకు వెళ్తే ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుపెట్టుకొని చంద్రబాబు నేల మీద కూర్చునే పరిస్థితి వైసిపి తీసుకొచ్చిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిది పిరికిపంద చర్య. టీ కోట్టు నడుపుకునే వ్యక్తి కార్పొరేటర్‌గా పోటీ చేయడాన్ని తట్టుకోలేని వైసీపీకి నాయకులు అతని టీ కొట్టును పడేయడం దారుణం. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ భర్త, కర్మ అయితే ఆమెను భర్త సమాధి వద్దకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్  చేశారు. పంచాయతీ ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలకు ఏ విధంగా పాల్పడ్డారో.. మున్సిపల్ ఎన్నికల్లో అదేవిధంగా దాడులు చేసి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారుఅని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు..  ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ స్పందిస్తూ.. చంద్రబాబును అడ్డు కోవడం అప్రజాస్వామ్యం అని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేదా? అని జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు.


ప్రజాస్వామ్యమా? నియంత రాజ్యమా?

రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో నారా చంద్రబాబు నాయుడుని పోలీసులు నిర్బంధించడాన్ని ఖండించిన టీడీపీ గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఖండించారు. ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? నియంత రాజ్యమా? అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 


దురదుష్టకరం..

చంద్రబాబు నాయుడిని సొంత జిల్లాలో పర్యటించకుండా అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్ఈసీ అనుమతితో చిత్తూరుకు వెళితే ఎయిర్ పోర్టులోనే నిర్బంధిస్తారా..? రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను నిలదీసి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా..? అని సోమిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో ప్రజా ప్రభుత్వం కాదు.. పోలీస్ పాలన నడుస్తున్నట్టుందని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


బాబును చూసి ప్రభుత్వం భయపడుతోంది..

చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి ప్రభుత్వం భయపడుతోంది. ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా?. చంద్రబాబును విమానాశ్రమంలో అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు రామతీర్థం వెళ్తున్న సమయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. గతంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో కూడా చంద్రబాబును అడ్డుకున్నారు. చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి జగన్‌కి ఎందుకు అంత భయం?. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వాలి లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందిఅని మాజీ మంత్రి హెచ్చరించారు.


ఏపీలో నియంత పాలన

ఏపీలో నియంతపాలన కొనసాగుతోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు నిర్బంధం అప్రజాస్వామికం. చంద్రబాబు నిర్బంధం పౌర స్వేచ్ఛను హరించడమే. చంద్రబాబు పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోంది. ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు చంద్రబాబుకు ఉంది. జగన్మోహన్ రెడ్డి చర్యలు హిట్లర్ పాలనను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా మారారు. ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా?. చర్యకు ప్రతి చర్య తప్పదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలిఅని యనమల ఒకింత హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రెడ్డిగూడెంలో మండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చంద్రబాబును అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Updated Date - 2021-03-01T18:54:58+05:30 IST