జగన్‌ది నవ మోసాల పాలన

ABN , First Publish Date - 2020-02-20T09:14:32+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్రకు మద్దతుగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో వాడవాడలా జనచైతన్య యాత్రలు కొనసాగాయి.

జగన్‌ది నవ మోసాల పాలన

జిల్లాలో ప్రజాచైతన్య యాత్రలో టీడీపీ నేతలు ధ్వజం



అనంతపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్రకు మద్దతుగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో వాడవాడలా జనచైతన్య యాత్రలు కొనసాగాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొమ్మిది నెలల పాలనలో ఆయన చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తూనే.. మరోవైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ నేతలు అడిగి తెలుసుకుంటూ యాత్రలో ముందుకు సాగారు. ఈ క్రమంలో జగన్‌ పాలనపై ప్రజలు తమ బాధను వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు అర్హులమైనా... పింఛన్‌లు, రేషన్‌కార్డులు తొలగించారంటూ పలువురు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేయడం యాత్రలో స్పష్టంగా కనిపించింది. జగన్‌ పిచ్చితుగ్లక్‌ పాలనకు బుద్ధి చెప్పాలంటే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఆ మేరకు వారిలో చైతన్యం నింపసాగారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆ పార్టీ శ్రేణులతో కలిసి రాయదుర్గం పట్టణంలోని 13వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో చైతన్య యాత్ర చేపట్టారు. ఇంటింటికి వెళ్లి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ తొమ్మిది నెలల పాలన నవమోసాల పాలనగా మారిందని ధ్వజమెత్తారు. అదే విధంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారఽథి పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం తాడంగిపల్లిలో ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ప్రజలకు వివరించారు.


జగన్‌ వ్యవహారాన్ని ఎండగట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడుతో కలిసి అనంతపురం పార్లమెంటు ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌రెడ్డి కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం దివాళా తీస్తోందని మండిపడ్డారు. పాలకుల నిర్లక్ష్యం, బెదిరింపులు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో ఎక్కడా పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్నారు.ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. అనంతపురం నగరంలో పాతూరులో ఆ పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజాచైతన్య యాత్ర చేపట్టాయి. పింఛన్‌లు, రేషన్‌కార్డుల తొలగింపు బాధితులను స్వయంగా వారు కలిసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2020-02-20T09:14:32+05:30 IST