‘రివర్స్ రూలర్‌గా జగన్ రికార్డుల్లో నిలుస్తారు’

ABN , First Publish Date - 2021-05-15T15:12:26+05:30 IST

కోవిడ్ రెండు దశల్లో చేసిన ఖర్చు, ఆదాయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

‘రివర్స్ రూలర్‌గా జగన్ రికార్డుల్లో నిలుస్తారు’

అమరావతి: కోవిడ్ రెండు దశల్లో చేసిన ఖర్చు, ఆదాయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. తొలిదశలో ఏపీ ఆర్థిక వృద్దిరేటు 4.3%కు పడిపోయిందని... కరోనా రెండో దశలో ఏపీలో నెగటివ్ గ్రోత్ ఖాయమన్నారు. 2021-22 వృద్దిరేటు ఇప్పటికే 0.3%కు పతనమైందని చెప్పుకొచ్చారు. రెండేళ్ల జగన్ పాలన రాష్ట్రంపై కనీవినీ ఎరుగని దుష్ప్రభావం చూపిందని విమర్శించారు. కరోనా కన్నా జగన్ బాధ్యతారాహిత్యమే ఏపీకి చేటు చేసిందని, కీడు వాటిల్లిందని ఆయన అన్నారు.  తయారీ రంగంపై పూర్తి నిర్లక్ష్యం, పారిశ్రామిక పెట్టుబడులు రాబట్టడంపై అశ్రద్ద వహించారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ రేటు ఇప్పటికే 10%కు చేరిందని, భవిష్యత్‌లో 20%కు దిగజారడం తథ్యమన్నారు. అభివృద్దికి గండికొట్టారన్నారు. పేదల ఉపాధిని, రాబడులను చావు దెబ్బతీశారని దుయ్యబట్టారు. అనేకమంది ఉద్యోగాలు ఊడగొట్టారని, వలస కార్మికుల పొట్టకొట్టారని ఆరోపించారు. కరోనా రెండోదశతో ఏపీలో తిరోగమన వృద్ధి ఖాయమని స్పష్టం చేశారు.


ద్రవ్యలోటు, ఆదాయలోటు, అధిక అప్పులే జగన్ ఘనత అని అన్నారు. 2021-22 ప్రతిపాదిత బడ్జెట్ తప్పుడు లెక్కలే తప్ప రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టేది కాదన్నారు. ఈ ఆర్థిక సంక్షోభం దుష్ఫలితాలతో మరో మూడేళ్లు రాష్ట్రం అతలాకుతలం అవుతుందని, కోలుకోలేని దుస్థితికి ఏపీని  దిగజార్చిన ఘనత జగన్‌దే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ అభివృద్ది పూర్తిగా రివర్స్‌గా మారుతోందన్నారు. అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ అధోగతే అని వ్యాఖ్యానించారు. అటు అభివృద్దిలో, ఇటు పేదల సంక్షేమంలో, ఉపాధిలో అంతా రివర్స్ చేశారన్నారు. ప్రజల నిజ ఆదాయాల్లో, విద్యా వైద్యలో, ప్రజల జీవన ప్రమాణాల్లో అంతా తిరోగమనమే అని అన్నారు. రివర్స్ రూలర్‌గా(తిరోగమన పాలకుడిగా) రికార్డులలో జగన్ రెడ్డి పేరు నిలిచిపోతుందని యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు.

Updated Date - 2021-05-15T15:12:26+05:30 IST