గాంధీ మళ్లీ పుట్టి ఏపీని కాపాడాలి: అనిత

ABN , First Publish Date - 2020-08-15T18:31:49+05:30 IST

2019 జూన్ నుంచీ స్వతంత్రం కోల్పోయామని... మరోసారి గాంధీ పుట్టి ఏపీని కాపాడాలి అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

గాంధీ మళ్లీ పుట్టి ఏపీని కాపాడాలి: అనిత

విజయవాడ: 2019 జూన్ నుంచీ స్వతంత్రం కోల్పోయామని... మరోసారి గాంధీ పుట్టి ఏపీని కాపాడాలి అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలని విమర్శించారు. ఏపీలో ఆడపిల్ల అర్ధరాత్రి కాదు కదా, పగలు కూడా బయటకి రాలేని పరిస్ధితి ఉందని అన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. అధికారిణి అనితారాణి విషయంలో జరిగిందే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రభుత్వం సోషల్ మీడియా 5 రూపీస్ పేటిఎం బ్యాచ్‌తో మాట్లాడిస్తున్నారని అనిత  దుయ్యబట్టారు. రాజమండ్రిలో 14 సంవత్సరాల‌ బాలికపై అఘాయిత్యంపై నోరుమెదపని ప్రభుత్వం మూడు రాజధానుల మాట స్వాతంత్ర్య దినోత్సవంలో మాట్లాడటం సీఎం చేతకానితనమని వ్యాఖ్యానించారు. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందని ఆరోపించారు. 22 మంది ఎంపీలు ఎప్పుడైనా ప్రత్యేకహోదా గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు.


ఏపీలో దిశ యాక్టుకు అతీగతీ లేదని..దిశ యాక్టు విషయంలో తెలంగాణ సీఎంకు హ్యాట్స్ ఆఫ్ చెప్పిన సీఎం ఏపీలో ఏం చేస్తున్నారని నిలదీశారు. కేంద్రం ఆమోదం లేని చట్టమని ఎలా స్పెషల్ అధికారులను, స్టేషన్లను పెట్టారని అన్నారు. టీడీపీ మీద మాట్లాడటానికి మాత్రమే ఏపీ మహిళా కమీషన్ ముందుకొస్తుందని...మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. దిశ యాక్టు అమలు అవుతుందా లేదా చూడటానికి తప్పులు చేస్తున్నారా అనిపిస్తోందని అనిత వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా మహిళల రక్షణ పట్టించుకోవాలని హితవుపలికారు. మద్యపాన నిషేధమే చేస్తానంటున్న ప్రభుత్వం, కొత్త బ్రాండ్లు ఎలా తెస్తోందని నిలదీశారు. సంవత్సర కాలంలో మహిళలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా నిర్విఘ్నంగా పనిచేసారని అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2020-08-15T18:31:49+05:30 IST