కక్షసాధింపులకు పాల్పడుతున్న సీఎం: సోమిశెట్టి

ABN , First Publish Date - 2021-05-17T05:19:07+05:30 IST

సీఎం జగన్‌ తనకు వ్యతిరేకంగా ఏమి జరిగినా, ఎవరు ఏమి మాట్లాడినా కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగదని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

కక్షసాధింపులకు పాల్పడుతున్న సీఎం: సోమిశెట్టి

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 16: సీఎం జగన్‌ తనకు వ్యతిరేకంగా ఏమి జరిగినా, ఎవరు ఏమి మాట్లాడినా కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగదని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నగరంలోని  పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీకే చెందిన ఎంపీ రఘురామ కృష్ణమరాజు ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సానుకూలంగా స్పందించి తప్పులను సరిదిద్దుకోవాల్సిన సీఎం జగన్‌ కక్ష పెంచుకుని పుట్టిన రోజు వేడుకల్లో ఉన్న రఘురామకృష్ణమరాజును సీఐడీ పోలీసుల చేత అరెస్టు చేయించి మానసిక క్షోభకు గురి చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి వారు తప్పు చేసినా విమర్శించే హక్కు ఉంటుందని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని అన్నారు. ఈ సూత్రాన్ని కాలగర్బంలో కలపేసిన సీఎం జగన్డ్‌ తాను ఏమి చేసినా జేజేలు కొట్టాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు. కరోనా రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతోందని, సరైన సౌకర్యాలు లేక, ఆక్సిజన్‌ అందక ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన సీఎం జగన్‌ కక్షసాధింపులకు పాల్పడుతుండడం దారుణమని అన్నారు. రఘురామకృష్ణమరాజు వ్యక్తిగతంగా జగన్‌పై ఎటువంటి ఆరోపణలు చేయలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అన్నారు.విమర్శలకు సానుకూలంగా స్పందించాల్సిన ప్రభుత్వం వ్యతిరేక చర్యలు చేపట్టడం దారుణమన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ తాను చేస్తున్న తప్పులను ఆత్మపరిశీలన చేసుకుని విపక్షాలు చేస్తున్న విమర్శలను సద్విమర్శలుగా భావించి, పరిపాలనను గాడిలో పెట్టాలని సూచించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే ముఖ్యమంత్రి జగన్‌ పూర్తి స్థాయిలో పని చేయాలని, ఇతరత్రా కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని అన్నారు. లేకపోతే ప్రజల ప్రతిఘటనను ఎదుర్కొని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సోమిశెట్టి హెచ్చరించారు. 

Updated Date - 2021-05-17T05:19:07+05:30 IST