రాష్ట్రాన్ని వణికిస్తోన్న జగరోనా

ABN , First Publish Date - 2020-03-22T10:52:56+05:30 IST

‘‘ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంటే.. రాష్ట్రాన్ని జగరోనా వణికిస్తోంది. కరోనా కంటే వైసీపీ నేతలు ప్రమాదకరంగా తయారయ్యారు. వైరస్‌ విజృంభిస్తున్నా రాష్ట్రంలో కరోనా పరీక్షా కేంద్రాలు...

రాష్ట్రాన్ని వణికిస్తోన్న జగరోనా

  • వైసీపీ దౌర్జన్యకాండపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
  • ఎస్‌ఈసీకే రక్షణ లేకపోతే సామాన్యుడి సంగతేంటి?
  • ఇంకా ఎన్నికల వాయిదాపై ఏడుపేనా?: టీడీపీ


అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంటే.. రాష్ట్రాన్ని జగరోనా వణికిస్తోంది. కరోనా కంటే వైసీపీ నేతలు ప్రమాదకరంగా తయారయ్యారు. వైరస్‌ విజృంభిస్తున్నా రాష్ట్రంలో కరోనా పరీక్షా కేంద్రాలు మూడే ఏర్పాటు చేయడం, అందులో ఒకటి మూసేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. శనివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా,  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపక్ష అభ్యర్థులపై వేధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. కోర్టు చీవాట్లు తిన్నా డీజీపీలో మార్పు రాలేదన్నారు. పోలీసులపై గౌరవం పోతోందన్నారు. వైసీపీ దౌర్జన్యకాండపై కేంద్రం, రాష్ట్రపతి, గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


ఏకపక్ష ఏకగ్రీవాలను రద్దు చేయాలని, ప్రజల హక్కుల్ని కాపాడి, ఎన్నికలకు రీ షెడ్యూలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపునిచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం నెల్లూరులో ఆయన మాట్లాడారు. ఆంధ్రలో కరోనా తీవ్రత లేదని ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ రాయడాన్ని, 650 ఎంజీ పారాసిటమాల్‌ వేసుకోమని సీఎంవో ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్‌ చెప్పడాన్ని తప్పుపట్టారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవని మాజీ మంత్రి చినరాజప్ప విమర్శించారు. ఏపీలో కరోనా బాధితులు పెరుగుతున్నారని శనివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్‌కే భద్రత లేకపోతే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించారు.


ప్రపంచం మొత్తం కరోనా గురించి భయపడుతుంటే.. మంత్రి బుగ్గన ఎన్నికలు, రాజకీయాల గురించి మాట్లాడడం ఏమిటంటూ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక దూరం పాటించాల్సిన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి దారుణంగా ఉండేదని ఆయన గుంటూరులో అన్నారు. స్థానిక ఎన్నికలపై సుప్రీం తీర్పుకూ వక్రభాష్యం చెపుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని విమర్శించడంపై పెట్టిన శ్రద్ధ ప్రజారోగ్యంపైనా, పాలనపైనా పెట్టడం లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మంగళగిరిలో అన్నారు. దేశం అంతా ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించిన వాతావరణం నెలకొంటే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాత్రం ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికల వాయిదాపై ఏడుపు వినిపించడం విస్మయం కలిగిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.


‘ప్రభుత్వం అనుకొన్నట్లు ఎన్నికలు జరిగి ఈ రోజు మూడు కోట్ల మంది ప్రజలు ఓట్లు వేయడానికి గుమికూడి ఉంటే ఏం జరిగేది? దేశం అంతా బంద్‌ పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేస్తుంటే ఎన్నికలు ఎందుకు జరగలేదని వీళ్లు బాధపడుతున్నారు’ అని విమర్శించారు. కరోనాను వైసీపీ ప్రభుత్వం తేలికగా తీసుకొంటోందంటూ మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజలను సంసిద్ధం చేయకుండా ప్రభుత్వం కరోనాను కామెడీషోగా చూస్తోందని విమర్శించారు.

Updated Date - 2020-03-22T10:52:56+05:30 IST