ప్రజల ప్రాణాలు కాపాడాలని కన్నీళ్లతో వేడుకున్న పట్టాభి

ABN , First Publish Date - 2021-05-13T17:49:12+05:30 IST

ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కన్నీళ్లతో ముఖ్యమంత్రిని వేడుకున్నారు.

ప్రజల ప్రాణాలు కాపాడాలని కన్నీళ్లతో వేడుకున్న పట్టాభి

అమరావతి: ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కన్నీళ్లతో ముఖ్యమంత్రిని వేడుకున్నారు. ప్రభుత్వం డాష్ బోర్డ్  సమాచారం చూశాక ప్రజల ప్రాణాలకు రక్షణలేదని టీడీపీ నేత వాపోయారు. రాష్ట్రంలో లక్షా97వేల370 యాక్టివ్ కేసులు(దాదాపు 2లక్షలు) ఉంటే, 13 జిల్లాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐసీయూ  పడకలు కేవలం 377మాత్రమే అని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెంటిలేటర్ బెడ్స్ కేవలం 693 మాత్రమే అని, ఆక్సిజన్ పడకలు కేవలం 1397  మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్రలో 45వేలకు పైగా యాక్టివ్ కేసులుంటే , కేవలం 4 వెంటిలేటర్ బెడ్స్‌తో ఎందరిని కాపాడతారని ప్రశ్నించారు. ఇది జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం కాదా అని ఆయన నిలదీశారు. చిత్తూరు జిల్లాలో 21,262 యాక్టివ్ కేసులుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెంటిలేటర్ బెడ్స్ కేవలం రెండంటే రెండని, ఐసీయూ పడకలు 36మాత్రమే ఉన్నాయన్నారు.


విజయనగరంలో ప్రస్తుతం అందుబాటులోఉన్న ఐసీయూ పడకలు-0, వెంటిలేటర్ బెడ్స్-0 అని... ఇవన్నీచూస్తుంటే, ఈ ముఖ్యమంత్రి ప్రజల జీవితాలకే సున్నాచుట్టాడని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సొంతజిల్లా కడపలో 9,067 యాక్టివ్ కేసులుంటే.. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐసీయూ బెడ్ ఒక్కటి మాత్రమే అని అన్నారు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో పడకలు లేకపోతే, పేదవారు లక్షలకు లక్షలుకట్టి  వారి ప్రాణాలు ఎలా కాపాడుకుంటారని ప్రశ్నించారు. కోవిడ్ తొలిదశ వ్యాప్తి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వెంటిలేటర్లు, ఐసీయూ పడకలు, ఆక్సిజన్ బెడ్స్ సమకూర్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


‘‘వ్యాక్సిన్లు తెప్పించి ప్రజల ప్రాణాలు కాపాడకుండా, తయారీ కంపెనీలకు కులాన్ని అంటగడతారా?...ప్రతిదానికీ కులమేనా? నువ్వు అసలు మనిషేనా జగన్మోహన్ రెడ్డి?. ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతుంటే ఇంకా వ్యాక్సిన్ కంపెనీలకు కులాలు అంటగడుతూ కాలయాపన చేస్తావా?. ప్రాణాలు కాపాడే వెంటిలేటర్ల కొనుగోలుపై దృష్టి పెట్టకుండా, నీ సమయాన్నంతా కక్ష సాధింపులు, అక్రమ కేసులతో వృథా చేస్తావా?. ముఖ్యమంత్రికి అంతగా కావాలంటే, ఎవరిని అరెస్ట్ చేయాలో చెబితే వారే స్వచ్ఛందంగా జైలుకువెళతారు. అంతేగానీ కక్ష సాధింపులతో ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలుగా మార్చవద్దని కన్నీళ్లతో వేడుకుంటున్నా’’ అంటూ పట్టాభిరామ్ అన్నారు.

Updated Date - 2021-05-13T17:49:12+05:30 IST