వైసీపీ మంత్రి అలా చెప్పారు: పట్టాభి

ABN , First Publish Date - 2021-05-08T19:06:35+05:30 IST

ఎన్ 440కే వైరస్ గురించి మాట్లాడారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెడతారా? ..

వైసీపీ మంత్రి అలా చెప్పారు: పట్టాభి

అమరావతి: ఎన్ 440కే వైరస్ గురించి మాట్లాడారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెడతారా? అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సీఎం జగన్‌ తీరుని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణతో పాటు, మహారాష్ట్రలో ఎన్440కే వైరస్ ఉనికిని గుర్తించామని సీసీఎంబీ చెప్పిందన్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్లు ఎన్ 440కే పై కథనాలు ప్రసారం చేశాయని తెలిపారు. 


 హిందూ, టైమ్స్ఆఫ్ ఇండియా పత్రికలు, వియాన్, టైమ్స్ నౌ, ఎన్‌డీటీవీ వంటి ఛానళ్లు కథనాలు ప్రచురించాయన్నారు. వాటిపై కూడా ఈముఖ్యమంత్రి కేసులుపెడతాడా? అని నిలదీశారు.  బాధ్యత గల ప్రతిపక్షనేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తే, అది తప్పా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. కొవిడ్ విషయంగా ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు చేసినా, ప్రజలను అప్రమత్తం చేసినా, ఎటువంటి కేసులు పెట్టరాదని సుప్రీంకోర్టు ఏప్రియల్ 30వ తేదీన ఇచ్చిన తీర్పులో స్పష్టంచేసిందన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసు తాలూకా రేపు ఈ ముఖ్యమంత్రి, డీజీపీ సుప్రీంకోర్టుకి ఏం సమాధానం చెబుతారో చూస్తామని పట్టాభి చెప్పారు. చంద్రబాబునాయుడిపై కేసుపెట్టడం ద్వారా ముఖ్యమంత్రి, డీజీపీ సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరించారన్నారు. ఒక టీవీ ఛానల్‌లో ఎన్ 440కే వైరస్ ఉనికిని కర్నూల్ ప్రాంతంలో గుర్తించారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారని గుర్తుచేశారు. అతనిపై కూడా ఈ ముఖ్యమంత్రి తప్పుడు కేసు పెట్టిస్తారా? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కూడా చేపట్టని ఈ ముఖ్యమంత్రి పనితీరుని చూసి, భయంతో సరిహద్దులు మూసేశాయని పట్టాభిరామ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-08T19:06:35+05:30 IST