అమరావతి: వైసీపీ పాలనలో సంక్షేమ ఫలాలు అందకపోవడం వలనే నేతన్నల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. చేనేత రంగం కుదేలయ్యేలా జగన్ నిర్ణయాలు ఉన్నాయన్నారు. రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాల వలన అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలతో కలిసి నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కృష్ణా జిల్లా పెడనలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక, అప్పుల భారంతో నేతన్న కాచన పద్మనాభం కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరమన్నారు. టీడీపీ హయాంలో నేతన్నకు ఏడాదికి సుమారు 50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను ఇచ్చామన్నారు. ప్రస్తుతదం వాటిని ఆపేసి రూ.24 వేలను చేతిలో పెట్టి సరిపెట్టుకోమంటున్నారన్నారు. అది కూడా సొంత మగ్గం ఉన్న వారికే వర్తించేలా నిబంధనలు పెట్టారని ఆయన ఆరోపించారు. ఆప్కో కొనుగోళ్లు ఆగిపోయాయని, మజూరీ, రాయితీలు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. సొంతంగా మగ్గం ఏర్పాటుకు సాయం లేదన్నారు. ప్రతి నేత కార్మికునికి నేతన్న నేస్తం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనితో పాటు అదనంగా గతంలో టీడీపీ ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలు కొనసాగించి ఆత్మహత్యలను నివారించాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి