Abn logo
May 12 2021 @ 11:57AM

‘చంద్రబాబుపై కేసులు పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది’

అమరావతి: ప్రజలు తమ వైఫల్యాలు మర్చిపోతారన్న దుర్భుద్ధితోనే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై కేసులు పెట్టడం ప్రతివాడికి ఒక ప్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. కేసులతో ఏమీ సాధించలేరని...తమ అవినీతి మీడియాలో విషప్రచారం తప్ప అని వ్యాఖ్యానించారు. మంత్రులు, సలహాదారులతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడిస్తే, ప్రజలు బతకరని ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. కరోనా యాక్టివ్ కేసుల జాబితాలో రాష్ట్రం ఆరవ స్థానంలో, రోజువారీ కేసుల పెరుగుదలలో 4వ స్థానంలో ఉందని తెలిపారు. వ్యాక్సినేషన్ పంపిణీలో 28వ స్థానంలో ఉందని ఆయన అన్నారు. ప్రజలు ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవారు వారికి అండగా ఉండాలని తెలిపారు. సమస్యల తీవ్రతను పక్కదారి పట్టించడానికి పాలకులు కుయుక్తులు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు.


చంద్రబాబు నాయుడు వ్యాక్సిన్లు పంచితే, మీరెందుకు అధికారంలో ఉండటమని ప్రశ్నించారు. టీడీపీ ఇంకా ప్రజలకు పూర్తి వాస్తవాలు చెప్పడంలేదన్నారు. రోజూ రాష్ట్రంలో సంభవించే మరణాలను ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని ఆరోపించారు. ప్రజలంతా అమ్మఒడి వద్దు ఆక్సిజన్ కావాలంటున్నారని... వసతి దీవెన వద్దు ఆసుపత్రుల్లో వసతి కావాలంటున్నారని టీడీపీ నేత అన్నారు. నాడు-నేడు వద్దు నేడు తమ ప్రాణాలు కాపాడంటున్నారని తెలిపారు. సున్నావడ్డీ వద్దు సున్నా మరణాలు ఉండేలా చేయమంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఆక్సిజన్ నిల్వల కోసం గ్లోబల్ టెండర్లు పిలవడమేంటని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టడంలో కాకుండా,  ప్రజలను కాపాడటంలో పోటీ పడాలని నక్కా ఆనంద్‌బాబు హితవుపలికారు. 

Advertisement
Advertisement
Advertisement