దళితుల రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నారా?: నక్కా ఆనందబాబు

ABN , First Publish Date - 2020-10-01T18:54:29+05:30 IST

దళితులపై నేరాలు పెరిగాయని ఎన్‌సీ‌ఆర్‌బీ నివేదిక చెబుతోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.

దళితుల రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నారా?: నక్కా ఆనందబాబు

అమరావతి: దళితులపై నేరాలు పెరిగాయని ఎన్‌సీ‌ఆర్‌బీ నివేదిక చెబుతోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దళితులపై దాడులు 13 శాతం పెరిగాయని తెలిపారు. ఎన్‌సీ‌ఆర్‌బీ నివేదికపై ప్రభుత్వం ఆనందపడుతున్నట్లుగా ఉందని.. జగన్‌కు అధికారం కట్టబెట్టడంలో కీలక పాత్ర వహించినందుకు దళితుల రుణాన్ని ఆయన ఈ విధంగా తీర్చుకుంటున్నారా అని ప్రశ్నించారు. దళితులపై దాడులతో సరిపెట్టకుండా వారికి చెందిన సమాధులను కూడా తవ్వేశారని మండిపడ్డారు. చిలకలూరిపేటలో దళితుల శ్మశానవాటికను తవ్వేస్తే సదరు మున్సిపల్ కమిషనర్‌కి ప్రమోషన్ ఇచ్చి మరీ ప్రభుత్వం సత్కరించిందని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న వారు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హితవుపిలికారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎప్పటికైనా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని తెలుసుకోండన్నారు. అడిగేవారు లేరన్నట్లుగా వ్యవహరిస్తున్న పాలకులతో సమాధానం చెప్పించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నక్కా ఆనందబాబు హెచ్చరించారు. 

Updated Date - 2020-10-01T18:54:29+05:30 IST