ఆక్వా రంగాన్ని గట్టెక్కించండి... Jaganకు లోకేష్ లేఖ

ABN , First Publish Date - 2022-06-16T16:54:04+05:30 IST

సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు.

ఆక్వా రంగాన్ని గట్టెక్కించండి... Jaganకు లోకేష్ లేఖ

అమరావతి: సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy)కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) లేఖ రాశారు. ఇసుక పాల‌సీ మార్చి భ‌వ‌న‌నిర్మాణ‌రంగాన్ని దానికి అనుబంధంగా ఉన్న 130కి పైగా వ్యవస్థల్ని అస్త‌వ్య‌స్తం చేసేశారన్నారు. వంద‌లాది మంది భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌కుల‌య్యారని ఆరోపించారు. అనాలోచిత విధానాల‌తో విద్యుత్ కోత‌లు ఆరంభించి ప‌రిశ్ర‌మ‌లకు ప‌వ‌ర్‌హాలీడే ప్ర‌క‌టించేలా చేశారని మండిపడ్డారు. ప్ర‌భుత్వ అనాలోచిత నిర్ణయాల వలన  రైతులు పంట‌లు వేయ‌కుండా క్రాప్‌హాలీడే పాటిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఆక్వా రంగం కూడా సంక్షోభంలో ప‌డిందన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధ‌ర అధికం కావ‌డం, రొయ్య‌ల ధ‌ర త‌గ్గిపోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్ర‌క‌టించాల‌ని రైతులు తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌డం విచార‌క‌రమని టీడీపీ నేత లేఖలో అన్నారు. 


ఆక్వారంగానికి మేలు చేస్తాన‌ని హామీలు ఇచ్చిన మీరు అధికారంలోకి వ‌చ్చాక...  ఫీడ్-సీడ్ యాక్ట్‌లతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారన్నారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి స‌బ్సిడీలు ఎత్తివేయ‌డం ముమ్మాటికీ ఆక్వారైతుల‌కు ద్రోహం చేయ‌డ‌మే అని అన్నారు. టీడీపీ ఇన్నిర‌కాలుగా ఆక్వారంగానికి ప్రోత్సాహం అందిస్తే, మీరు స‌బ్సిడీలు ఎత్తేసి సంక్షోభానికి కార‌కుల‌య్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వారంగం ప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వం చూపిన నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇప్ప‌టికైనా క‌ళ్లుతెరిచి ఆక్వా రైతుల డిమాండ్ల‌న్నీ త‌క్ష‌ణ‌మే నెర‌వేర్చ‌క‌పోతే ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయ‌రంగం దారిలోనే ఆక్వా హాలీడే కూడా త‌ప్ప‌క‌పోవ‌చ్చన్ని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-16T16:54:04+05:30 IST