ధాన్యం రైతుల దైన్యంపై జగన్‌కు లోకేష్ లేఖ

ABN , First Publish Date - 2022-04-28T17:23:02+05:30 IST

ధాన్యం రైతుల దైన్యంపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ లేఖ రాశారు.

ధాన్యం రైతుల దైన్యంపై జగన్‌కు లోకేష్ లేఖ

అమరావతి: ధాన్యం రైతుల దైన్యంపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మ‌ద్ద‌తు ధ‌ర‌తో ఖ‌రీఫ్ ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ‌న్న రాజ్య‌మంటేనే రైత‌న్న రాజ్య‌మ‌ని ఇచ్చిన భ‌రోసా ఆచ‌ర‌ణ‌లో ఎక్క‌డా క‌నిపించ‌డంలేదని విమర్శించారు. పొలాల వ‌ద్దే రైతుల నుంచి పంట‌లని మ‌ద్ద‌తు ధ‌ర‌కు కొనుగోలు చేస్తామ‌ని  ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రైతాంగం నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జ‌ర‌ప‌కుండానే ర‌బీ కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించ‌డం చాలా అన్యాయమన్నారు. ఖ‌రీఫ్ ధాన్యం స‌గం కూడా కొన‌కుండానే ర‌బీ కొనుగోలు కేంద్రాల‌ను ఎలా ప్రారంభించారో అర్థం కావ‌డంలేదని లేఖలో తెలిపారు. ర‌బీ ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొంటున్నారంటే అదీ లేదని అన్నారు. రైతాంగం నుంచి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనే ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌నకీ ఆమ‌డ‌దూరంలో కొనుగోళ్లు ఆపేశారని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 7 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరణ తగ్గిందన్నారు.


అర‌కొర ధాన్యం కొనుగోలు చేసి రైతుల‌కు రూ.1000 కోట్ల వ‌ర‌కూ బ‌కాయిలు పెట్టేశారని చెప్పారు. క్వింటా ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ రూ.1,960, సాధారణ రకం రూ.1,940గా నిర్ణ‌యించినా రైతుల‌కు ఆ మేర‌కు ధ‌ర ద‌క్క‌డంలేదన్నారు. రైతుభ‌రోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయ‌క‌పోవ‌డం.. ఒక‌వేళ కొనుగోలు చేసినా స‌కాలంలో సొమ్ము ఇవ్వ‌క‌పోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మిల్లర్లు, దళారుల‌కు క్వింటా 1300కు రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని తెలియజేశారు. రైతుభ‌రోసా కేంద్రాలు పెట్టినా,  ఈ-క్రాప్ బుకింగ్లో నిర్లక్ష్యంతో 70 శాతం మంది రైతులు ధాన్యం అమ్ముకోలేక తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారన్నారు. రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన రైతుభ‌రోసా కేంద్రాలు వైసీపీ సేవ‌లో త‌రిస్తున్నాయని మండిపడ్డారు.


పండించిన ధాన్యం కొనుగోలు జ‌ర‌గ‌క‌, పెట్టుబ‌డుల‌కు తెచ్చిన అప్పులు వ‌డ్డీలు పెరిగి రైతులు ద‌య‌నీయ స్థితిలో తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారన్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ఖ‌రీఫ్‌లో పండిన మొత్తం ధాన్యం పంట‌ని మ‌ద్ద‌తు ధ‌ర‌తో కొనుగోలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. వేల‌కోట్ల‌కు చేరిన ధాన్యం బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాలన్నారు. ఈ క్రాప్‌ బుకింగ్ గురించి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి అంద‌రూ న‌మోదు చేసుకునేలా చేయాలన్నారు. ర‌బీ సీజ‌న్‌లోనైనా మొత్తం ధాన్యం కొనుగోలుకి ఏర్పాట్లు చేయాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-28T17:23:02+05:30 IST