టీడీపీ నేత ఇల్లే టార్గెట్‌

ABN , First Publish Date - 2022-08-19T04:08:04+05:30 IST

టీడీపీ నేత ఇల్లే టార్గెట్‌

టీడీపీ నేత ఇల్లే టార్గెట్‌
ఎక్స్‌కవేటర్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీనివాసనగర్‌ ప్రజలు, తహసీల్దార్‌ కాళ్లపై పడి వేడుకుంటున్న జోగమ్మ

- ఎక్స్‌కవేటర్‌తో వెళ్లిన అధికారులు

- 52 ఇళ్లు కూల్చివేతకు ప్రయత్నం

- అడ్డుకున్న శ్రీనివాసనగర్‌ వాసులు

- వెనుదిరిగిన అధికారులు

- పలాసలో తీవ్ర ఉద్రిక్తత


వారంతా 40 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చారు. ఎంపీ నిధులతో అక్కడ బస్‌షెల్టర్‌ నిర్మించారు. మున్సిపాలిటీకి పన్ను కూడా చెల్లిస్తున్నారు. అక్కడే నివాసం ఉంటున్న టీడీపీ నేతను వైసీపీ పెద్దలు లక్ష్యంగా చేసుకున్నారు. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. ఎక్స్‌కవేటర్‌తో ఇల్లు కూల్చి వేసేందుకు యత్నించారు. టీడీపీ నేత సూర్యనారాయణ ఇల్లు ఎక్కడంటూ ఆరా తీశారు. అధికారుల ఉద్దేశాన్ని పసిగట్టిన స్థానికులు అడ్డుకున్నారు. ఎక్స్‌కవేటర్‌ ఎదుట బైఠాయించారు. దీంతో అధికార యంత్రాంగం వెనుదిరిగింది. 


(పలాస, ఆగస్టు 18)

తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులను ప్రభుత్వం టార్గెట్‌ చేసు కుంది. గురువారం స్థానిక 27వ వార్డు శ్రీనివాసనగర్‌లో 52 ఇళ్లను కూల్చేందుకు తహసీల్దార్‌ ఎల్‌.మధు సూదనరావు, మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు యంత్రాంగంతో వచ్చారు. స్థానికులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో అధికార యంత్రాంగం వెనుదిరిగింది. దీనికంతా కారణం వైసీపీ నాయకుల ఆక్రమణలపై టీడీపీ నాయకులు ప్రశ్నించడమేనన్న వాదన వినిపిస్తోంది. పలాసలో వారం నుంచి టీడీపీ, వైసీపీ నాయకుల మాటల యుద్ధం ప్రారంభమైంది. కొండలు, చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూములను వైసీపీ నాయ కులు ఆక్రమించుకున్నారంటూ టీడీపీ ఆరోపించింది. ఆ పని మీరే చేశారంటూ వైసీపీ నాయకులు ప్రత్యారోపణ చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైసీపీ నాయ కులు విలేకర్ల సమావేశం నిర్వహించి ఆక్రమణలపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష క్షమాపణలు చెప్పాలని, లేకుంటే టీడీపీ కార్యాలయం ముట్టడిస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దల నుంచి ఒత్తిడి తేవడంతో అధికారులు రగంలోకి దిగినట్లు తెలిసింది. 


మాజీ వైస్‌చైర్మన్‌ లక్ష్యంగా..

27వ వార్డు కౌన్సిలర్‌, మాజీ వైస్‌చైర్మన్‌ గురిటి సూర్య నారాయణ శ్రీనివాసనగర్‌లో చెరువుగట్టుపై నివాసం ఉం టున్నారు. ఈ చెరువు 1.10 ఎకరాలు ఉండేది. ఆయకట్టు లేకపోవడంతో పేదలు గట్టుచుట్టూ 50 పైగా ఇళ్లు నిర్మించుకున్నారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. మిగిలిన స్థలాన్ని మున్సిపల్‌ అధికారులు ఇటీవల పూడ్చి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించారు. కాం గ్రెస్‌ హయాంలో ఇక్కడ ఇందిరమ్మ గృహాలు, టీడీపీ హయాంలో పట్టాలు ఇవ్వడంతో స్థానికులు పక్కాగృహాలు నిర్మించుకున్నారు. గురిటి సూర్యనారాయణ కూడా ఇక్కడే ఇల్లు కట్టు కుని నివాసం ఉంటున్నారు. ఇదేగట్టుపై టీడీపీ హయాంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు నిధులతో నిర్మించిన బస్‌షెల్టర్‌తో పాటు ఎన్టీఆర్‌ స్వగృహ మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణంలో ఉంది. ఇటీవల ఆక్రమణలపై టీడీపీ నాయకులు ప్రశ్నించిన నేపథ్యంలో వైసీపీ నాయకులు సూర్యనారాయణను టార్గెట్‌ చేసుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 


అడ్డుకున్న ప్రజలు

ఎక్స్‌కవేటర్‌తో మున్సిపల్‌ సిబ్బంది, సచివాలయ సిబ్బం ది, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మొత్తం 27వ వార్డుకు చేరుకుని గృహాలు కూల్చేందుకు సిద్ధమయ్యారు. ముం దస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు రావడంతో స్థాని కులు అడ్డుకున్నారు. తాము 40 ఏళ్లుగా నివాసం ఉంటు న్నామని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు కొం తమంది ఉండగా, ఇందిరమ్మ పథకం కింద గృహాలు నిర్మించుకున్న వారు ఉన్నారని వారు అన్నారు. తమకు రెవెన్యూ అధికారులే పట్టాలు ఇవ్వగా మున్సిపల్‌ ఆస్తి పన్నుతో పాటు కరెంటు బిల్లులు కూడా తమ పేరుమీదే కడుతున్నామని స్పష్టం చేశారు. తమ ఇళ్లు తొలగించడం అన్యాయమన్నారు. 


సూర్యనారాయణ ఇల్లు ఎక్కడ?

స్థానికులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరుగుతు న్నారు. ఈ నేపథ్యంలో ఓ అధికారికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. వెంటనే ఆయన కౌన్సిలర్‌ సూర్యనారాయణ ఇల్లు ఎక్కడుందని స్థానికులను ప్రశ్నించారు. ఏదో జరగబోతుందని పసిగట్టిన స్థానికులు గుమిగూడి ఎక్స్‌కవేటర్‌ ముందు భైటాయించారు. గురిటి సూర్యనారాయణ ఆ ప్రాంతంలో అజాతశత్రువు గా పేరుపొందారు. ఇప్పటివరకు ఆయన మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన మూడుమార్లు గెలుపొందారు. దీంతో ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని ఇల్లు కూల్చేందుకు అధికారులు వచ్చా రని తెలుస్తోంది. ఈ సందర్భంగా సూర్యనారా యణ విలేకర్లతో మాట్లాడుతు 21 ఏళ్ల నుంచి తాను ఇక్కడే నివాసం ఉంటున్నానని, తనకు ప్రభుత్వం పట్టా కూడా మంజూరు చేసిందని తెలి పారు. తాను ఏనాడూ ఆక్రమణలను ప్రోత్సహించ లేదని, నిజాయతీగా ఉన్న తనపై వైసీపీ నాయ కులు కక్షపెట్టుకున్నారని ఆరోపించారు.


హైకోర్టు ఆదేశాల మేరకేనంట

చెరువులు ఆక్రమించడం నేరమని, హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉండడంతో చెరువుల్లో ఆక్రమణలు  తొలగిస్తున్నా మని తహసీల్దార్‌ మధుసూదనరావు అన్నారు. 27వ వార్డు లో ఉన్న చెరువులో 50 పైగా ఇల్లు కట్టుకున్నారని, తాము ఎవర్నీ టార్గెట్‌ పెట్టుకోలేదని తెలిపారు. తమపై వైసీపీ నాయకుల ఒత్తిళ్లు కూడా లేవని స్పష్టం చేశారు. పెంటి బధ్ర, పద్మనాభపురం కాలనీ సమీపంలో ఉన్న భూములు కూడా గుర్తించి ఆక్రమణలు తొలగించామన్నారు. చెరువును ఇటీవల మున్సిపల్‌ అధికారులు కూడా కప్పారని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించగా.. వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. 


వైసీపీ నాయకుల హల్‌చల్‌

టీడీపీ కౌన్సిలర్‌ గురిటి సూర్యనారాయణ ఇంటి వద్దకు గురువారం రాత్రి 7 గంటల సమయంలో మునిసిపాలిటీలోని వైసీపీ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జ్‌లు వచ్చారు. మంత్రి అప్పలరాజుకు క్షమాపణ చెప్పాలంటూ హల్‌చల్‌ చేశారు. దీంతో వారిని సూర్యనారాయణ వర్గీయులు అడ్డుకున్నారు. ఇక్కడకు మీరు రావా ల్సిన అవసరం లేదని చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా తాము స్థానికులమని.. తమకు ఎవరూ వెళ్లిపోవాలని చెప్పనవసరం లేదంటూ అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా సూర్యనారాయణ గృహాన్ని పడగొట్టడానికే అధికారులు సిద్ధమవడంతో టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా కార్యదర్శి విఠల్‌, బీసీ సెల్‌ కన్వీనర్‌ లొడగల కామేశ్వరరావు యాదవ్‌, గాలి కృష్ణారావుతో పాటు ఆ పార్టీ శ్రేణులు వచ్చి సంఘీభావాన్ని తెలిపాయి. అర్ధరాత్రి వరకూ ఉద్రిక్తత కొనసాగింది. 


మీ కాళ్లు పట్టుకుంటాం సార్‌.. మా గృహాలు కూల్చొద్దు

- తహసీల్దార్‌ను వేడుకున్న వృద్ధురాలు

‘మీ కాళ్లు పట్టుకుంటాం సార్‌.. మా గృహాలు కూల్చొద్దు’ అంటూ ఓ వృద్ధురాలు తహసీల్దార్‌ను వేడుకుంది. గురువారం పలాస మునిసిపాలిటీ శ్రీనివాసనగర్‌లో ఉల్లాసపేట చెరువు వద్ద ఆక్రమణలు తొలగించేందుకు తహసీల్దార్‌ మధుసూదన రావు, మునిసిపల్‌ కమిషనర్‌ టి.రాజగోపాలరావు పోలీసు సిబ్బం దితో చేరుకున్నారు. దీంతో స్థానికులు వారితో వాగ్వాదం చేశారు. తమ గృహాలు కూల్చొద్దని కోరారు. అయినా అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో జోగమ్మ అనే వృద్ధురాలు తహసీల్దార్‌ మధు సూదనరావు కాళ్లపై పడి.. తమ ఇల్లు కూల్చొద్దని వేడుకుంది. కట్టుకున్న ఇంటిని తొలగిస్తామనడం అన్యాయమని రోదించింది. దుర్గా అనే యువతి మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్లు ఇస్తా మని చెబుతూనే.. కూల్చివేతకు పాల్పడడం సరికాదని పేర్కొంది.  


కట్టినవి తీయడం భావ్యం కాదు

జగనన్న గృహాల పేరుతో ప్రభుత్వం ఇళ్లు ఇస్తోంది. ఇలాంటప్పుడు పేదలమైన మేము కట్టుకున్న ఇళ్లు తొలగిస్తామని చెప్పడం భావ్యం కాదు. ఇందిరమ్మ, ఎన్టీఆర్‌ పథకాల కింద ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నాం. 40 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు తీసుకున్న నిర్ణయం తప్పు.

- ఎం.తిరుపతిరావు, శ్రీనివాసనగర్‌, పలాస


ఇంటిపన్నులు కూడా చెల్లిస్తున్నాం

ఇంటిపన్ను ఏటా చెల్లిస్తున్నాం. 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్న మేము కట్టుకున్న ఇళ్లు అక్రమమని అధికారులు చెప్పడం అన్యాయం. రాజకీయాలు ఉంటే ప్రజావేదికలో తేల్చుకోవాలి. పేదలతో ఆటాడుకోవడం సరికాదు.

- కిరణ్‌కుమార్‌, శ్రీనివాసనగర్‌,  పలాస

Updated Date - 2022-08-19T04:08:04+05:30 IST