అదుపులోనే అప్పులంటూ ప్రభుత్వం తప్పుడు రాతలు రాయిస్తోంది: జీవీ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-28T00:00:17+05:30 IST

అదుపులోనే అప్పులంటూ ప్రభుత్వం సాక్షిపత్రికలో తప్పుడు రాతలు రాయిస్తోందని టీడీపీ నేత జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ..

అదుపులోనే అప్పులంటూ ప్రభుత్వం తప్పుడు రాతలు రాయిస్తోంది: జీవీ రెడ్డి

అమరావతి: అదుపులోనే అప్పులంటూ ప్రభుత్వం సాక్షిపత్రికలో తప్పుడు రాతలు రాయిస్తోందని టీడీపీ నేత జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అప్పులుచేయడాన్ని సమర్థించిన ఆర్థికమంత్రి బుగ్గన, సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ ప్రజలకోసమేనంటూ బుకాయిస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో మండిపడ్డారు. 


‘‘జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేవలం రెండున్నరేళ్లలోనే రూ.3 లక్షల 64వేల 104 కోట్లు అప్పుచేశారు. 1956 నుంచి 2019 వరకు ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు  రూ.3లక్షల 14వేల 495 కోట్లు. 63 సంవత్సరాల్లో అయిన అప్పుకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ రెండున్నరేళ్లలోనే రూ.3లక్షల 64వేల 104 కోట్లు అప్పుచేశారు. రూ.3 లక్షల కోట్ల అప్పులను టీడీపీ ప్రభుత్వం చేసిందని సజ్జల తనవయస్సును కూడా అగౌరవపరుచుకునేలా అబద్దాలు చెప్పారు. రూ.3 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి అయిన అప్పని సజ్జలకు తెలియదా?. రాష్ట్ర విభజన జరిగే నాటికి రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటే, దాన్ని చంద్రబాబునాయుడు రూ.4 వేల కోట్లకు తగ్గించారు. కానీ జగన్మోహన్ రెడ్డి, తన చేతగాని తనంతో కేవలం రెండేళ్లలోనే దాన్ని రూ.38 వేల కోట్లకు పెంచేశారు.  చంద్రబాబునాయుడి హయాంలో కేవలం 4 ఏళ్లలోనే వేల కోట్ల ఆస్తులను రాష్ట్రంలో సృష్టించారని సాక్షి పత్రికలోనే రాశారు. 2016-17లో రూ.21,300 కోట్లు, 2017-18లో రూ.25,722 కోట్లు, 2018-19లో రూ.35,364 కోట్లను చంద్రబాబుప్రభుత్వం సంపద సృష్టికి ఖర్చు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి 2019-20లో రూ.37,230 కోట్లు కేపిటల్ ఎక్స్‌పెండేచర్ కింద ఖర్చుపెట్టినట్లు చెప్పుకుంటే, కాగ్ నివేదికలో మాత్రం రూ.12,244కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని ఉంది. కేపిటల్ ఎక్స్ పెండేచర్ వినియోగాన్ని కూడా రెండున్నర, మూడు రెట్లు పెంచి తప్పు రాతలు రాస్తున్నారు. సంక్షేమం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలేచెబుతోంది.’’ అని జీవీ రెడ్డి విమర్శించారు. 


Updated Date - 2021-12-28T00:00:17+05:30 IST