ఏడాదిన్నరలో ప్రభుత్వం సాధించిందేమి లేదు: సాంబశివరావు

ABN , First Publish Date - 2020-09-30T18:17:08+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో తనకు అప్పగించిన భాద్యతను సమర్ధవంతంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బాపట్ల పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు తెలిపారు.

ఏడాదిన్నరలో ప్రభుత్వం సాధించిందేమి లేదు: సాంబశివరావు

ప్రకాశం: ప్రస్తుత పరిస్థితుల్లో తనకు అప్పగించిన భాద్యతను సమర్ధవంతంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బాపట్ల పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు తెలిపారు. గ్రామస్థాయి నుండి బాధ్యతతో పనిచేసే కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారన్నారు. ఏడాదిన్నరలో ప్రభుత్వం సాధించిందేమి లేదని విమర్శించారు. కేవలం కక్ష్యసాధింపుతో కూడిన అరాచక పాలన నడుస్తుందని మండిపడ్డారు. గతంలో లోటు బడ్జెట్ నుండి బయటకు వచ్చి ముందుకెళ్తున్న రాష్ట్రాన్ని ప్రస్తుతం ఏమి జరుగుతుందో అందరూ చూస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైన గత ప్రభుత్వ హయాంలో ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష కోట్ల రూపాయల అప్పులు తీసుకు వచ్చారు..ప్రజలను మభ్య పెట్టేందుకు కంటితుడుపు కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప ఒరిగేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు లేరన్నారు. సాగర్ నిండా నీరు ఉన్నా రైతులకు సాగునీరు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారన్నారు.


ఎన్టీఆర్ జలసిరి పథకంతో రైతులకు మొత్తం ప్రభుత్వం భరించిందని...అదే పథకాన్ని వైయస్సార్ జలకళ అని పేరు మార్చి బోరు వరకు వేస్తామంటున్నారని అన్నారు. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అర్ధాంతరంగా మధ్యలోనే నిలిపివేశారని మండిపడ్డారు.సామాన్యులను ప్రభుత్వం పీల్చిపిప్పి చేస్తోందని... ప్రతీ రంగం నిర్వీర్యం అయిపోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఏ కులాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించారో ఆ వర్గాల నుండే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని తెలిపారు. గ్రానైట్ రంగాన్ని ప్రభుత్వ ఆదాయ వనరుగా చూడకుండా ఆ రంగంలో ఉన్న ప్రత్యర్ధులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గ్రానైట్ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేయటం వల్ల ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కరోనా అనంతరం ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తామని సాంబశివరావు పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-30T18:17:08+05:30 IST