మంత్రి పెద్దిరెడ్డి... దళితులను అణగదొక్కాలని చూస్తే ఖబడ్దార్: Chandrababu

ABN , First Publish Date - 2022-01-08T19:58:02+05:30 IST

రామకుప్పం అంబేద్కర్ విగ్రహం వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

మంత్రి పెద్దిరెడ్డి... దళితులను అణగదొక్కాలని చూస్తే ఖబడ్దార్: Chandrababu

చిత్తూరు: రామకుప్పం అంబేద్కర్ విగ్రహం వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దళితులను అణగదొక్కాలని చూస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. దళితులకు జరిగిన అవమానంపై క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మంత్రిపై ఉందన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంబేద్కర్‌కు జరిగిన అవమానంపై వెనక్కి తగ్గేది లేదన్నారు. అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని  చంద్రబాబు పేర్కొన్నారు.


అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఈనాటిది కాదని అన్నారు. దళితుల మనోభావాలను దెబ్బతీసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం పెట్టి మరో పెద్ద వివాదాన్ని పోలీసులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దళితులకు అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దళితులకు అండగా నిలవాల్సిన పోలీసులు.. దళారులకు నిలుస్తున్నారన్నారు. వివాదాన్ని అందరితో చర్చించి పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. దళితుల ఆత్మహత్యలకు వైసీపీ సర్కార్ కారణంగా నిలుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 


అంతకుముందు... రామకుప్పం మండలం శివాజీనగర్‌లో అంబేద్కర్ విగ్రహం వివాదంపై చంద్రబాబును కొంతమంది దళితులు కలిశారు.  అంబేద్కర్‌కు అవమానం జరిగిందంటూ వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్ విగ్రహం తొలగించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం పెట్టే చర్యలకు వైసీపీ స్థానిక నేతలు పాల్పడుతున్నారని దళితులు తెలిపారు. 

Updated Date - 2022-01-08T19:58:02+05:30 IST