అధికార అహంకారంతో అరాచకాలు

ABN , First Publish Date - 2021-10-20T06:31:04+05:30 IST

అధికారంలో వున్నామన్న అహకారంతో వైసీపీ మూకలు అరాచకాలకు పాల్పడుతున్నాయని టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు.

అధికార అహంకారంతో అరాచకాలు
మాట్లాడుతున్న బుద్దా నాగజగదీశ్‌

వ్యూహం ప్రకారమే టీడీపీ ఆఫీసులపై దాడులు

వైసీపీ శ్రేణుల తీరుపై టీడీపీ నేత బుద్ద నాగజగదీశ్‌ తీవ్ర ఆగ్రహం

ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరిక

లోకేశ్‌ పర్యటన వాయిదాతో టీడీపీ శ్రేణుల్లో నిరాశ


అనకాపల్లి, అక్టోబరు 19: అధికారంలో వున్నామన్న అహకారంతో వైసీపీ మూకలు అరాచకాలకు పాల్పడుతున్నాయని టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం రాత్రి పార్టీ నూతన కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ, వైసీపీ శ్రేణులు ఒక వ్యూహం ప్రకారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంతోపాటు పలుచోట్ల పార్టీ కార్యాలయాలు, నాయకులపై దాడులు చేసి, సామగ్రిని ధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ పాలకుల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. వైసీపీ శ్రేణుల అరాచకాలకు నిరసనగా బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్‌ను జయప్రదం చేయాలని బుద్ద నాగజగదీశ్వరరావు పిలుపునిచ్చారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.  మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ, పోలీసులు... వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలో తన కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ ఆఫీస్‌పై వైసీపీ వారు దాడి చేస్తుంటే డీజీపీ తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

లోకేశ్‌ పర్యటన వాయిదాతో టీడీపీ శ్రేణుల్లో నిరాశ

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అనకాపల్లి పర్యటన వాయిదా పడడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహం చెందారు. లోకేశ్‌ బుధవారం అనకాపల్లిలో పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయాల్సి వుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు నాలుగు రోజుల నుంచి ఏర్పాట్లలో నిమగ్నమాయ్యరు. పట్టణంలోని పలు ప్రాంతాలను పసుపు జెండాలు, తోరణాలతో అలంకరించారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి బెల్లం మార్కెట్‌ వద్ద వున్న పార్టీ కార్యాలయం భారీ ఊరేగింపుతో లోకేశ్‌ను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున అనకాపల్లి తరలిరావడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. కానీ వైసీపీ శ్రేణులు మంగళవారం సాయంత్రం రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసి, విధ్వంసం సృష్టించడంతో లోకేశ్‌ పర్యటన వాయిదా పడింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు తీవ్రనిరాశ చెందారు.


Updated Date - 2021-10-20T06:31:04+05:30 IST